English | Telugu
38 భాషలు, 240 దేశాలు.. ప్రపంచానికి అందుబాటులో నాగ చైతన్య!
Updated : Dec 6, 2023
ప్రస్తుతం థియేటర్లకు గట్టిపోటీ ఇస్తున్న మాధ్యమం ఓటీటీ. సినిమాలు రిలీజ్ అయిన నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. దానికితోడు వెబ్ సిరీస్‌లు కూడా సినిమాలకు ధీటుగా ఉంటున్నాయి. సినిమా చూసిన అనుభూతినే కలిగిస్తుండడంతో వెబ్‌సిరీస్‌లకు ఆదరణ బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్లు వెబ్ సిరీస్‌లు చేసి సక్సెస్ అయ్యారు. తాజాగా నాగచైతన్య కూడా ‘ధూత’ పేరుతో వచ్చిన వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ వెబ్ సిరీస్‌ను విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించారు.
‘ధూత’కు వస్తున్న రెస్పాన్స్, ఈ వెబ్‌సిరీస్ విశేషాల గురించి శరత్ మరార్ మాట్లాడుతూ ‘విక్రమ్ కుమార్ ఈ కథ చెప్పినపుడు చైతుకి, నాకు బాగా నచ్చింది. ఈ కథని విక్రమ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యని విధంగా ఎంతో కేర్ తీసుకుని కథను నడిపించారు. అందుకే ఈ సిరీస్ ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది. సింపుల్ కథే అయినప్పటికీ ట్రీట్‌మెంట్ కథకి కొత్త అందాన్నిచ్చింది. అదే దీనికి బాగా ప్లస్ అయింది. ఈ సిరీస్‌ను ఇతర భాషల్లో సబ్ టైటిల్స్‌తో స్ట్రీమ్ అవుతోంది. మొత్తం 38 భాషల్లో 240 దేశాల ప్రజలకు ‘ధూత’ అందుబాటులో ఉంది. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వెబ్‌సిరీస్ మా బేనర్ పేరును నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సిరీస్ సక్సెస్ కావడంతో భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులు చేసేందుకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ సిరీస్‌కి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ కథంతా వర్షంలోనే నడుస్తుందని, వర్షం కూడా ఒక పాత్రలా ఉంటుందని విక్రమ్ ముందుగానే చెప్పారు. ఈ సిరీస్ మొత్తం పూర్తయ్యే సరికి వర్షం ఎఫెక్ట్ కోసం 300కిపైగా ట్యాంకర్లను తెప్పించాల్సి వచ్చింది. విక్రమ్‌కుమార్‌గారు చెప్పినట్టుగానే ఈ కథకు వర్షం తోడవడం వల్ల ఎంతో ఎఫెక్టివ్‌గా అనిపించింది’ అన్నారు.