English | Telugu
వైజయంతీ మూవీస్ సంచలనం.. 'మెగా 157' ఆగిపోయినట్టేనా!
Updated : Oct 10, 2023
మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఇది 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తరహాలో ఉంటుందని, ఆ సినిమాకి దీనికి చాలా పోలికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' కంటెంట్ ని అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వైజయంతీ మూవీస్ ప్రకటించడం సంచలనంగా మారింది.
చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా 1990లో విడుదలై ఎంతటి సంచలన విజయం సాధిందో తెలిసిందే. ఈ సినిమా రీమేక్ చేయాలని లేదా సీక్వెల్ చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ చిరంజీవే ఈ తరహా సినిమా చేయబోతున్నాడనే వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు 'జగదేకవీరుడు అతిలోకసుందరి'పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని.. రీమేక్, సీక్వెల్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ ఏం చేయాలన్నా తమకే హక్కు ఉంటుందని, మేం ఎవరికీ హక్కులను ఇవ్వలేదని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. తమ అనుమతి లేకుండా కంటెంట్ ని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. వైజయంతీ మూవీస్ ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం పరోక్షంగా 'మెగా 157'ని ఉద్దేశించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి 'మెగా 157' టీం వైజయంతీ మూవీస్ దగ్గర అనుమతి తీసుకొని ముందుకు వెళ్తుందో లేక ప్రాజెక్ట్ కి బ్రేక్ లు ఏమైనా పడతాయో చూడాలి.