English | Telugu
'SSMB 29' తర్వాత మహాభారతమే.. 'RRR-2'కి మరో దర్శకుడు!
Updated : Jul 10, 2023
ఇప్పుడు ఇండియన్ సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి పేరు అనేది ఒక బ్రాండ్ లా మారిపోయింది. ఆయన తదుపరి సినిమాల అప్డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' గురించి అయితే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ 'మహాభారతం' ప్రాజెక్ట్ గురించి చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
తెలుగు సినీ చరిత్రలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన 'సింహాద్రి' సినిమా నిన్నటి(జూలై 9)తో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ తో ప్రత్యేకంగా ముచ్చటించిన విజయేంద్ర ప్రసాద్.. రాజమౌళి తదుపరి సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 'ఆర్ఆర్ఆర్'ని మించి అత్యంత భారీ స్థాయిలో ఉండనుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అలాగే మహేష్ తో సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి 'మహాభారతం'ని రూపొందించనున్నారని తెలిపారు. రాజమౌళి 'మహాభారతం' అంటే దేశంలోని అగ్ర నటులందరినీ భాగం చేస్తూ, పలు భాగాలుగా తెరకెక్కిస్తారు అనడంలో సందేహం లేదు. అదే జరిగితే ఈ ఫ్రాంచైజ్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో వసూళ్ళు రాబట్టే అవకాశముంది. మరోవైపు 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ కూడా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ అందులో భాగమవుతారని, దీనిని హాలీవుడ్ ఫిల్మ్ గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అయితే ఈ సీక్వెల్ కి రాజమౌళి దర్శకత్వం వహించవచ్చు లేదా ఆయన పర్యవేక్షణలో వేరొకరు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.