English | Telugu
'మిస్టర్ ఇడియట్'గా మాస్ రాజా వారసుడు!
Updated : Jul 9, 2023
మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి ఆయన సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'పెళ్లి సందడి' ఫేమ్ గౌరి రోనంకి దర్శకురాలు. మార్చిలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళింది. తాజాగా ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేశారు మేకర్స్.
ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను తాజాగా రవితేజ విడుదల చేశారు. ఈ సినిమాకి 'మిస్టర్ ఇడియట్' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. మాస్ రాజా కెరీర్ లో 'ఇడియట్'కి ప్రత్యేక స్థానముంది. చంటిగాడు లోకల్ అంటూ రవితేజ చేసిన సందడిని అంత తేలికగా మర్చిపోలేరు ప్రేక్షకులు. అలాంటిది ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి హీరోగా పరిచయమవుతున్న మాధవ్ సినిమాకి 'మిస్టర్ ఇడియట్' టైటిల్ ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. టైటిల్ కి తగ్గట్లుగానే పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. కథానాయకుడు ఒక అమ్మాయిని హత్తుకొని, మరో అమ్మాయి చేతిని పట్టుకోవడం చూస్తుంటే టైటిల్ సరిగ్గా సరిపోయింది అనిపిస్తోంది.
ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని ఇప్పటికే దర్శకనిర్మాతలు తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రామ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ కుమార్, ఎడిటర్ గా విప్లవ్ వ్యవహరిస్తున్నారు.