English | Telugu

‘లియో’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ ఆగిపోయింది.. ఎందుకో తెలుసా?

కొంత మంది హీరోల సినిమాలకు ప్రారంభం నుంచి రిలీజ్‌ వరకు ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఏదో విధంగా షూటింగ్‌ డిలే అవుతుంది. ఏదో విధంగా షూటింగ్‌ పూర్తి చేస్తే రిలీజ్‌కి వచ్చే సరికి రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఇంతకుముందు ఈ తరహా కష్టాలు కమల్‌ హాసన్‌ సినిమాలు వుండేవి. ఇప్పుడు ఆ బాధ్యతను విజయ్‌ తీసుకున్నాడా అనిపిస్తోంది. ఎందుకంటే అతను లేటెస్ట్‌గా చేస్తున్న సినిమా ‘లియో’. ఈ సినిమా అక్టోబర్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. పలు భాషల్లో రిలీజ్‌ అవుతున్న పాన్‌ ఇండియా మూవీ ఇది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రిలీజ్‌కి వచ్చేసరికి సినిమాకి రకరకాల దెబ్బలు తగులుతున్నాయి. మల్టీప్లెక్స్‌కి సంబంధించిన ఇష్యూ వల్ల హిందీలో థియేటర్స్‌ దొరకలేదు. తమిళనాడులో మార్నింగ్‌ షోలు లేవు. కన్నడలో చాలా తక్కువ థియేటర్స్‌ దొరికాయి. తెలుగులో మాత్రం చాలా ఎక్కువ థియేటర్స్‌లో పర్‌ఫెక్ట్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ విషయంలో చిత్ర యూనిట్‌ హ్యాపీగా ఉన్న సమయంలో ‘లియో’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ను ఆపివేయాలంటూ సివిల్‌ కోర్టు నోటీసు ఇచ్చింది. అడ్వకేట్‌ కె.నరసింహారెడ్డి వేసిన పిటిషన్‌ ప్రకారం కోర్టు స్టే ఇచ్చింది. అసలేం జరిగింది, సినిమా రిలీజ్‌ను ఎందుకు ఆపారు అనే విషయాలని ‘లియో’ తెలుగు రైట్స్‌ తీసుకున్న సూర్యదేవర నాగవంశీ ఒక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి వివరించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించిన పూర్తి డీటైల్స్‌ను మీడియాకు తెలియజేయబోతున్నారు.