English | Telugu

50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ‘ఊర్వశి’కి దక్కిన అరుదైన గౌరవం!

50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు ‘ఊర్వశి’ శారద. అందులో 125 సినిమాలు మలయాళంలోనే చెయ్యడం విశేషం. అందుకే కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన జె.సి.డేనియల్‌ అవార్డుకు 2024కిగాను శారదను ఎంపిక చేశారు. ఈ అవార్డులో భాగంగా రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు శారద.

1945 జూన్‌ 25న గుంటూరు జిల్లా తెనాలిలో వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు జన్మించారు శారద. ఆమె అసలు పేరు సరస్వతి. 1955లో వచ్చిన కన్యాశుల్కంతో బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన శారద.. చాలా తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భావోద్వేగంతో సాగే పాత్రలు, సామాజిక సమస్యలపై రూపొందిన బలమైన పాత్రలతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. ఉత్తమనటిగా జాతీయ అవార్డులు అందుకోవడంలోనూ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు శారద. ‘తులాభారం’ (1968), ‘స్వయంవరం’ (1972), ‘నిమజ్జనం’ (1977).. ఇలా మూడు సినిమాల్లో ప్రదర్శించిన అద్వితీయమైన నటనకు మూడు సార్లు ఉత్తమనటిగా అవార్డులు ఆమెను వరించాయి. ఆరోజుల్లో ఉత్తమనటికి ఇచ్చే అవార్డును ఊర్వశి పేరుతో పిలిచేవారు. అలా శారద పేరు ముందు ఊర్వశి ఇంటి పేరుగా చేరింది.

సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు శారద. 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగంలోనూ సేవలందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా ప్రేక్షకులు పదికాలాలపాటు గుర్తుంచుకోదగిన పాత్రలు చేశారు ఊర్వశి శారద.