English | Telugu
ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో వెట్రిమారన్ మల్టీస్టారర్!
Updated : Apr 11, 2023
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేసే అవకాశముందని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు, 'వార్-2' సినిమా చేయనున్నాడు. వీటి తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా వెట్రిమారన్ తోనే అని ఇటీవల న్యూస్ బలంగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు.
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'విడుతలై-1' తెలుగులో 'విడుదల-1' పేరుతో ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తుండటం విశేషం. తాజాగా అల్లు అరవింద్ తో కలిసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన వెట్రిమారన్.. మీడియా అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో తాను పలువురు టాలీవుడ్ స్టార్స్ తో కథాచర్చలు జరిపినట్లు తెలిపారు. 'ఆడుకలం' తరువాత తాను, అల్లు అర్జున్ కలిశామని.. ఆ సమయంలో 'వడ చెన్నై'లో ఓ పవర్ ఫుల్ రోల్ ని ఆయనకు నేరేట్ చేశానని, కానీ తరువాత స్క్రిప్ట్ లో జరిగిన మార్పుల వల్ల తాము కలిసి పని చేయలేకపోయామని అన్నారు. అదే టైంలో మహేష్ బాబుతో సైతం చర్చలు జరిగాయని, కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ఇక 'అసురన్' తర్వాత ఎన్టీఆర్ ని కలిసి చర్చించానని, అయితే ఆ సినిమాకి చాలా టైం పట్టొచ్చు అని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. "తెలుగులో మీ మొదటి సినిమా ఎన్టీఆర్ తోనా? అల్లు అర్జున్ తోనా? లేక ఇద్దరితో మల్టీస్టారరా?" అనే ప్రశ్నకు "కాలమే నిర్ణయిస్తుంది" అని సమాధానమిచ్చారు వెట్రిమారన్.