English | Telugu
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడండి!
Updated : Mar 7, 2023
విక్టరీ వెంకటేష్ సినిమాలంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు ఉండే క్రేజే వేరు. అయితే తన అన్న కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి తాజాగా ఆయన నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'ని మాత్రం అందరూ కలిసి చూడొద్దని, విడివిడిగా చూడమని వెంకటేష్, రానా చెప్పడం ఆసక్తికరంగా మారింది.
వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'రానా నాయుడు'. ఇది మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడే ఇది వెంకటేష్ శైలికి భిన్నంగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ఈ సిరీస్ బోల్డ్ గా వయోలెన్స్ తో నిండి ఉంటుందని ఇప్పటికే అర్థమైంది. విడుదల నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేష్, రానా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సిరీస్ ని ఒంటరిగా చూడమని సలహా ఇచ్చారు.
రానా మాట్లాడుతూ "వెంకటేష్ గారి సినిమాలంటే ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారు. ఈ సిరీస్ మాత్రం అలా చూడకండి. ఎవరికివారు విడివిడిగా చూడండి." అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం వస్తున్న ఓటీటీ కంటెంట్ ల తరహాలోనే ఇది కూడా ఉంటుంది. ఇప్పటికే ఓటీటీ కంటెంట్ ఎవరికివారు చూడటం అలవాటైపోయింది. దీనిని కూడా అలాగే చూడండి. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి" అన్నారు.