English | Telugu
డ్రగ్స్ కేసులో హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు సమన్లు
Updated : Aug 29, 2023
నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడామెకు ఓ సమస్య వచ్చి పడింది. డ్రగ్స్ కేసులో కొచ్చి ఎన్‌ఐఎ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. చాలా సంవత్సరాలుగా వరలక్ష్మీ శరత్‌కుమార్ వద్ద పి.ఎ.గా పనిచేస్తున్న ఆదిలింగం నుడ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. అతనికి అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఎ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన డబ్బును చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. దానికి వరలక్ష్మీ శరత్‌కుమార్ సహకారం కూడా ఉందని ఎన్‌ఐఎ అధికారులు భావిస్తున్నారు. ఆమె దగ్గర పనిచేసిన ఆదిలింగంకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాని కోసం ఆమెకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఆదిలింగం దగ్గర కోలీవుడ్‌లో ఇంకా ఎవరెవరి ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసుతో టాలీవుడ్ ప్రముఖులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఎన్‌ఐఎ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.