English | Telugu
ఒకే సినిమా కోసం ఇద్దరు పోటీ.. మరి బాలకృష్ణ ఎవరికి సై అంటాడో!
Updated : Nov 11, 2023
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా కాలం తర్వాత బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించడంతో కథల ఎంపిక విషయంలో బాలకృష్ణ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ‘భగవంత్ కేసరి’ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాబీ డైరెక్షన్‌లో సినిమా స్టార్ట్ చేసేశారు బాలయ్య. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎవరితో సినిమా చేసే అవకాశం ఉంది అనే విషయంలో చర్చ జరుగుతోంది. దిల్ రాజు బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. వాస్తవానికి ‘భగవంత్ కేసరి’ దిల్ రాజు చెయ్యాల్సిన ప్రాజెక్ట్. చివరి క్షణంలో అది వేరొకరికి వెళ్లింది.
ఇప్పుడు బాలయ్య డేట్స్ కోసం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించారు దిల్‌రాజు. బాలకృష్ణ కోసం వంశీ పైడిపల్లితో యాక్షన్ బేస్డ్ స్టొరీ రాయిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్యతో సినిమా చేసేందుకు అల్లు అరవింద్ ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని గతంలో ఎనౌన్స్ చేశారు కూడా. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌ను గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ‘అఖండ’ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్‌రెడ్డి సీక్వెల్‌ను కూడా తానే నిర్మించాలని చూస్తున్నారు. అయితే బోయపాటి మాత్రం ఇప్పుడు తన దృష్టంతా సూర్య హీరోగా చేయబోయే పాన్ ఇండియా మూవీపైనే పెట్టాడు. ఈ సినిమా తర్వాతే ‘అఖండ’ సీక్వెల్ గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఈలోపు వంశీ పైడిపల్లి రెడీ చేస్తున్న కథను ఫైనల్ చేసి బాలయ్యకు చెప్పి ఒకే చేయించుకుంటే ముందుగా దిల్‌రాజు ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఇద్దరు నిర్మాతల్లో బాలయ్య ఎవరి సినిమా ఓకే చేస్తాడు, ఎవరి సినిమా ముందు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.