English | Telugu
‘సలార్’కి ఆ నిర్మాతలు భయపడ్డారు.. అందుకే అలా చేశారు!
Updated : Dec 5, 2023
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘సలార్’ చిత్రం ఎంతో మంది హీరోలను, నిర్మాతలను భయపెట్టిన మాట వాస్తవం. ఎలాగంటే.. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చెయ్యాలని భావించారు మేకర్స్. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల సినిమా రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ 22కి మార్చారు. సలార్ సెప్టెంబర్‌లోనే వస్తుందని భావించిన మిగతా టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలను డిసెంబర్‌కి పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఆ క్రమంలోనే సెప్టెంబర్‌లో రిలీజ్ చెయ్యాలనుకున్న చాలా సినిమాలు రిలీజ్ వాయిదా పడ్డాయి. ఆ సమయంలోనే నాని ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చెయ్యాలని భావించారు. డిసెంబర్ 23న నితిన్ ‘ఎక్స్‌ట్రా’ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు.
ఇదిలా ఉండగా.. సలార్ డిసెంబర్ 22కి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడంతో మళ్ళీ నిర్మాతల్లో కలకలం మొదలైంది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రిలీజ్ అవ్వాల్సిన హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా చిత్రాలను వాయిదా వేస్తే సంక్రాంతికి రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అందుకని హాయ్ నాన్న డిసెంబర్ 7, ఎక్స్‌ట్రా డిసెంబర్ 8కి వచ్చాయి. సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాతో పోటీ పడే ఉద్దేశం తమకు లేని కారణంగానే ముందుకు వచ్చామని ఎక్స్‌ట్రా నిర్మాత సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.