English | Telugu
పవన్ కోసం ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు!
Updated : Feb 28, 2023
ఒకప్పుడు భారీ చిత్రాల నిర్మాత అంటే ఎ.యం.రత్నం పేరు చెప్పుకునేవారు. కోలీవుడ్‌లో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలను ఈయన తెలుగులో విడుదల చేసేవారు. అలా ఈయన తెలుగులో విడుదల చేసిన చిత్రాలు అనేకం బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగులో కూడా విజయశాంతితో కర్తవ్యం, ఆశయం వంటి చిత్రాలను మోహనగాంధీ దర్శకత్వంలో రూపొందించాడు. ఇక తానే మెగాఫోన్ చేతపట్టి పెద్దరికం సినిమా తీశారు. ఆ తర్వాత సంకల్పం సినిమా తీశారు. కర్తవ్యం, పెద్దరికం చిత్రాలు విజయం సాధించగా, ఆశయం, సంకల్పం చిత్రాలు బాగా ఆడలేదు. కానీ ఆ తర్వాత తన కుమారులను హీరో డైరెక్టర్లుగా ప్రమోట్ చేసే విషయంలో ఆయన నిర్మించిన చిత్రాలు బాగా నష్టాలను కలిగించాయి. అలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ తల అజిత్ ఈయనకు వరుస చిత్రాలు చేసి పెట్టారు. దాంతో ఆర్థికంగా ఈయన మరలా పుంజుకున్నారు.
ఇక ఈయన తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఖుషీ, బంగారం వంటి రెండు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీని మొదలుపెట్టారు. తెలంగాణ రాబిన్‌హుడ్ గా పేరు తెచ్చుకున్న పండుగల సాయన్న పాత్రలో పవన్ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకు మొదలైనప్పటి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా అనుకున్న విధంగా షెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ఏఎం రత్నం మాత్రం ఈ చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఈయన నిజంగా సినిమాలను అత్యంత వేగంగా తీయగలరు. క్వాలిటీ మిస్ కాకుండానే అతి తక్కువ సమయంలో ఇలాంటి పీరియాడికల్ స్టోరీలను తీయగలిగిన ప్రతిభ ఆయనకు ఉంది. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఆయన ఎంతో వేగంగా అతి తక్కువ బడ్జెట్ తో పూర్తి చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కాగా హరిహర వీరమల్లు చిత్రం పూర్తి చేయకుండా పవన్ మరోవైపు తమిళ రీమేక్ చిత్రం వినోదాయసిత్తమును ప్రారంభించారు. మరో వైపు తేరీ రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ ను బరిలోకి దించుతున్నారు. సుజిత్ తో ఓ జి చేస్తున్నారు. ఇలా హరిహర వీరమల్లు కంటే తరువాత వచ్చిన చిత్రాలు సెట్స్ పైకి వెళుతూ వుండటంతో కృష్ జాగర్లమూడికి ఏఎం రత్నంకి పవన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మొదటగా మొదలైన చిత్రాన్ని మొదట పూర్తి చేయాలి. కానీ ఆ చిత్రాన్ని అలాగే పెండింగ్‌లో ఉంచి కొత్తగా వచ్చిన చిత్రాలను సెట్స్ పైకి తీసుకుని వెళుతూ ఉంటే అటు హీరోను ఏమీ అనలేక ఏయం రత్నం క్రిష్ జాగర్లమూడి మౌనం వహిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. మరీ పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా హరిహర వీరమల్లు దర్శకనిర్మాతలు పడుతున్న కష్టాలను చూసి దానికి సమయాన్ని కేటాయిస్తాడేమో వేచి చూడాలి.