English | Telugu
స్టార్ హీరోలకు తాతలు దొరికారు!
Updated : Mar 1, 2023
సినిమా అన్నాక ఏపాత్రలనైనా చేసి మెప్పించాల్సి ఉంటుంది. గతంలో ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీరంగారావు, సావిత్రి, గుమ్మడి వంటి వారందరు ఇలా విభిన్న పాత్రలను పోషిస్తూ మెప్పించిన వారే. ఎన్టీఆర్, సావిత్రి హీరోహీరోయిన్లుగా నటిస్తూనే రక్తసంబంధం చిత్రంలో అన్నా చెల్లి పాత్రలను పోషించి మెప్పించారు. ఇక పౌరాణిక పాత్రలో నెగటివిటీ ఉండే రావణాసరుడు నుంచి ఆడా మగా కాని బృహన్నల పాత్ర వరకు ఎన్టీఆర్ పోషించి మెప్పించారు. ఇలాగే ఎస్వీరంగారావు కూడా. ఇక చిన్న వయసులోనే తన కంటే పెద్ద అయిన ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారికి తండ్రి, తాత పాత్రలను పోషించిన ఘనత గుమ్మడికి దక్కుతుంది. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.
ఇక నేటితరంలో ప్రకాష్ రాజ్ దూకుడు, అతడు, గోవిందుడు అందరివాడేలే వంటి చిత్రాలలో ముసలి వేషాలు వేశారు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి28 చిత్రంలో తాత పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో తాత పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. అత్తారింటికి దారేది, అజ్క్షాతవాసి చిత్రంలో బొమ్మన్ ఇరానీ, అల వైకుంఠపురంలో సచిన్ ఖేడేకర్ ఇలా ఆయన చిత్రాలలో తాత పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇక మరోవైపు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రభాస్‌కు తాతగా బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
సంజయ్‌దత్ తాత పాత్రను పోషిస్తున్నాడని వార్తలు వస్తూ ఉండటంతో ఆయనే ఈ చిత్రంలో తాత పాత్రకు ఓకే చెప్పడానికి ఆపాత్రలో ఉన్న ప్రాధాన్యం ఏమిటి? సంజయ్ దత్ తాత పాత్రను ఎందుకు పోషిస్తున్నారు? అనే అనుమానాలు వస్తున్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2లో తన నటనతో అదరగొట్టిన సంజయ్‌దత్ ఈ చిత్రంతో తాత అంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఆ పాత్రలో ఉండే ఉంటుందని అనిపిస్తోంది. మొత్తానికి స్టార్డం ఉన్న ప్రకాష్ రాజ్, అందునా సంజయ్ దత్ లు తాత పాత్రలను పోషిస్తూ ఉండటం చూస్తుంటే ఆశ్చర్యం వేయకమానదు.