English | Telugu

చిరంజీవి 'నో' అంటే.. ఆడియన్స్ 'వావ్' అన్నారు!

సినిమా రంగంలో కొందరు తీసుకునే నిర్ణయాలు కొందరికి ప్లస్‌ అయితే, మరికొందరికి మైనస్‌ అవుతుంది. ఒక హీరో రిజెక్ట్‌ చేసిన కథతో మరో హీరో దగ్గరకి వెళ్ళి దాన్ని బ్లాక్‌బస్టర్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అలాంటి నిర్ణయం వల్ల ఒక డిజాస్టర్‌ నుంచి హీరోలు తప్పించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి వాటికి ఒక ప్రమాణం అంటూ ఏమీలేదు. ఆ సమయంలో వారు తీసుకునే నిర్ణయం సరైనదేనని అనుకోవడమే. అలాంటి పరిస్థితే ఒకసారి మెగాస్టార్‌ చిరంజీవికి వచ్చింది. వెబ్‌ సిరీస్‌లలో ఎంతో పాపులర్‌ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ మనోజ్‌ వాజ్‌పేయి ఎంతో మంచి పేరు తెచ్చింది. ఈ సిరీస్‌ తర్వాత అతను చాలా బిజీ అయిపోయాడు. ఈ సిరీస్‌ని తెలుగు డైరెక్టర్స్‌ రాజ్‌ అండ్‌ డికె రూపొందించారు. మొదటి భాగం పెద్ద హిట్‌ అవ్వడంతో దాన్ని కొనసాగిస్తూ రెండో భాగాన్ని కూడా చేశారు. ఇందులో సమంత విలన్‌గా నటించింది. ఈ సిరీస్‌తో రాజ్‌ అండ్‌ డికెలకు చాలా మంచి పేరు వచ్చింది. అయితే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ అనే సబ్జెక్ట్‌ను మెగాస్టార్‌ చిరంజీవి కోసం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆ సబ్జెక్ట్‌తో ఒక సినిమా చెయ్యాలని వారి ఆలోచన. ఈ సబ్జెక్ట్‌ విన్న అశ్వనీదత్‌ దాన్ని చిరంజీవికి పంపారు. తన రీ ఎంట్రీలో వచ్చిన మొదటి సినిమా ఖైదీ నంబర్‌ 150
ఘనవిజయం సాధించడంతో దాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఉన్న చిరంజీవికి ది ఫ్యామిలీ మ్యాన్‌ సబ్జెక్ట్‌ అంతగా రుచించలేదు. ఇద్దరు పిల్లల తండ్రిగా తను నటించడం, పైగా యారగెంట్‌గా వుండే భార్య క్యారెక్టర్‌ కూడా ఉండడంతో అది తనకు సరిపడదని అనుకున్నారు. అందులో కొన్ని మార్పులు కూడా చేయమని చిరంజీవి సూచించారు. ఏ కారణం వల్లనో ఆ సబ్జెక్ట్‌కి మోక్షం లభించలేదు. అనుకోకుండా అది వెబ్‌ సిరీస్‌గా మారింది. చిరంజీవి చెప్పిన మార్పులు చేసి ఆ సబ్జెక్ట్‌తో సినిమా చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదోగానీ, వెబ్‌ సిరీస్‌ చెయ్యాలన్న రాజ్‌ అండ్‌ డికె నిర్ణయం వారిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇది నిజంగా ఒక వండర్‌ అనే చెప్పాలి.