English | Telugu

తమిళ్‌లో సీక్వెల్‌ ఓకే.. మరి తెలుగు మాటేమిటి?

ప్రస్తుతం సినిమాల్లో సీక్వెల్‌ హవా ఎక్కువగా నడుస్తోంది. ఒక భాష అని ఏమీ లేదు. నార్త్‌ నుంచి సౌత్‌ వరకు సీక్వెల్స్‌ చేసేందుకు హీరోలు, దర్శకనిర్మాతలు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా ఓ వార్త అందరికీ క్యూరియాసిటీ కలిగిస్తోంది. రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధృవ’ చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌ చేస్తే బాగుంటుందని మెగాభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దానికి తగ్గట్టుగానే సీక్వెల్‌ ఉంటుందని అధికారికంగా ప్రకంటించారు. అయితే అది తెలుగులో కాదు, తమిళ్‌లో. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ‘తని ఒరువన్‌’ చిత్రాన్ని తెలుగులో సురేందర్‌రెడ్డి రూపొందించారు. ఇప్పుడు తమిళ్‌లో సీక్వెల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చింది. దానికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. చాలా వెరైటీగా ఉన్న టీజర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది.
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైమ్‌లోనే తని ఒరువన్‌ కథ వినిపించారని సమాచారం. అయితే అధికారిక ప్రకటన వస్తేగానీ ఈ విషయంలో అందరికీ క్లారిటీ రాదు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. అయితే ‘ధృవ’కి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వెయిట్‌ అండ్‌ సీ.