English | Telugu

దయచేసి ఆ పని చేయండి : లారెన్స్

సైడ్ డాన్సర్ గా కెరీర్ ప్రారంభింంచి స్టార్ కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, హీరోగా ఎదిగిన వ్యక్తి రాఘవ లారెన్స్. ఈయన తన జర్నీ ఎప్పుడూ మరచిపోలేదు. పేరు, డబ్బు రాగానే ఓ ఛారిటీ సంస్థను ప్రారంభించి తనకు వీలైనంత మేరకు సాయం చేస్తూనే వస్తున్నారాయన. తన ఛారిటీకి ఆర్థిక సాయాన్ని చేయాలని అప్పుడెప్పుడో లారెన్స్ రిక్వెస్ట్ చేశారు. ఆయనకు విరాళాలు బాగానే వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ స్టార్ కొరియోగ్రాఫర్ తన ఛారిటీకి విరాళాలు ఇవ్వకండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఛారిటీకి డబ్బులు కావాలని అడుగుతారు. మరి లారెన్స్ ఎందుకు విరాళాలు వద్దంటున్నారని అనుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే.. ''నేను గర్వంతో నా ఛారిటీకి విరాళాలను వద్దని చెప్పటం లేదు. ఒకప్పుడు నేను హీరోగా రెండేళ్లకు ఓ సినిమా చేసేవాడిని. అప్పుడు వచ్చిన డబ్బులతో ఓ 60 మంది పిల్లలను పెంచుతూ వచ్చాను. ఇప్పుడు హీరోగా ఏడాది మూడు సినిమాలు చేస్తున్నాను. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అందువల్ల నా ఛారిటీకి సంబంధించిన వ్యవహారాలను నేను చూసుకోగలను. మీలో ఎవరికైనా సాయం చేయాలని ఉంటే మీకు దగ్గరలోని ఛారిటీ సంస్థకు డబ్బుని ఇవ్వండి. ఎవరైనా నా ద్వారానే సాయం చేయాలని భావిస్తే... ఏ ఛారిటీ డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతుందో ఆ వివరాలను మీకు చెబుతాను. మీరే వెళ్లి వారికి సాయం చేయండి'' అన్నారు.

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చంద్రముఖి 2'. పి.వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ సినిమాను నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 18 ఏళ్ల ముందు వచ్చిన చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్. రజినీకాంత్ స్థానంలో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు.