English | Telugu
‘కంగువా’ కోసం సూర్య కష్టాలు
Updated : Sep 10, 2023
నచ్చిన పాత్ర కోసం ఎంతటి కష్టానైనా భరించటానికి సిద్ధపడే హీరోల్లో సూర్య ఒకరు. ఈ వెర్సటైల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేస్తూ అభిమానులనే కాకుండా ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలను సైతం ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న మూవీ ‘కంగువా’. శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఇందులో కథానాయిక. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా దీన్ని కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సినిమాను ఏకంగా 10 భాషల్లో విడుదల చేయటానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా కూడా ప్లానింగ్ జరుగుతోంది.
‘కంగువా’లో సూర్య వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌లో ఆ విషయం చాలా క్లియర్‌గా స్పష్టమైంది. ఈ సినిమాకు సంబంధించిన మరే వివరాలను బయటకు రానీయకుండా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సినిమాపై సూర్య చాలా ఫోకస్‌గా ఉన్నారు. చాలా కష్టపడుతున్నారని టాక్. ఎందుకంటే ఇప్పటి వరకు సూర్య చేయనటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్ ఇందులో హైలైట్‌గా నిలవనుంది. ఈ లుక్ కోసం ప్రతీ రోజు సూర్య రెండున్నర గంటల పాటు కష్టపడుతున్నారట. అందుకని ఆయన ముందుగానే లొకేషన్‌కు వచ్చి మేకప్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారట.
ఈ సినిమా తర్వాత సూర్య వరుస సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సుధా కొంగరతో సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ మూవీ చేయబోతున్నారు. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ చందు మొండేటి సైతం చతుర్వేదాలపై సినిమాను చేయటానికి సూర్యతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు , బాలీవుడ్‌కి చెందిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్ర రీసెంట్‌గా సూర్యను కలిసి కర్ణ అనే సబ్జెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమన్నారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.