English | Telugu

మళ్ళీ మెగా హీరోతోనే సురేందర్ రెడ్డి!

'ఏజెంట్' వంటి ఘోర పరాజయం తర్వాత సురేందర్ రెడ్డి చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి నెలకొంది. ఆయన అల్లు అర్జున్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే అంతకంటే ముందే మరో మెగా హీరోతో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.

'ఉప్పెన'తో తెలుగుతెరకు హీరోగా పరిచయమై, మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఆ తరువాత 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలతో నిరాశపరిచారు. త్వరలో 'ఆదికేశవ' అనే మాస్ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పుడు ఆయనకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా సురేందర్ రెడ్డికి కూడా చాలా కీలకం. 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత అయన తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సినిమాతో ఆయన కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

కాగా సురేందర్ రెడ్డి గత ఐదు చిత్రాలను పరిశీలిస్తే అందులో మూడు మెగా హీరోలతో చేసినవే ఉన్నాయి. ఆయన 'రేసుగుర్రం', 'ధృవ', 'సైరా నరసింహారెడ్డి' చేయగా మూడు సినిమాలూ ఆకట్టుకున్నాయి కానీ, భారీ బిజినెస్ కారణంగా 'సైరా' బాక్సాఫీస్ వద్ద నష్టాలను చూసింది. ఇప్పుడు మరోసారి మెగా హీరోతో జత కడుతున్నారు సురేందర్ రెడ్డి. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూద్దాం.