English | Telugu
'రావణాసుర'తోనైనా హిట్ కొడతాడా!
Updated : Apr 3, 2023
టాలీవుడ్ లో ఉన్న ప్రతిభ గల దర్శకులలో సుధీర్ వర్మ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన తన ప్రతిభకు తగ్గ ఫలితాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. దర్శకుడిగా ఆయన టాలీవుడ్ కి పరిచయమై పదేళ్లు పూర్తయిపోయింది. ఈ పదేళ్లలో ఆయన దర్శకత్వం వహించిన ఐదు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. అందులో మొదటి సినిమా 'స్వామిరారా' మాత్రమే ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఆరో సినిమాగా వస్తున్న 'రావణాసుర' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విజయం ఆయనకు చాలా కీలకం.
పదేళ్ల క్రితం టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో 'స్వామిరారా' అనే క్రైమ్ కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై అందరినీ ఆశ్చర్యపరిచాడు సుధీర్ వర్మ. పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహం దొంగతనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2013 లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దర్శకుడిగా మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు సుధీర్ వర్మ. స్టార్స్ సైతం సుధీర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే సుధీర్ మాత్రం ఆ తర్వాత 'స్వామిరారా' రేంజ్ సక్సెస్ ని రిపీట్ చేయలేకపోయాడు. 'స్వామిరారా' తర్వాత 'దోచేయ్', 'కేశవ', 'రణరంగం' అనే సినిమాలు చేశాడు. ఇవి పరవాలేదు అనిపించుకున్నాయి కానీ ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. ఇక మరో ఫ్లాప్ మూవీ 'శాకిని డాకిని'కి సుధీర్ వర్మ దర్శకుడు అనే విషయం కూడా చాలామందికి తెలిసి ఉండదు.
ఇలా 'స్వామిరారా' తర్వాత సరైన విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సుధీర్ వర్మకి మాస్ మహారాజా రవితేజ పిలిచి మరీ అవకాశమిచ్చాడు. సుధీర్ ఫ్లాప్స్ లో ఉన్నాడనే విషయాన్ని పట్టించుకోకుండా.. కేవలం అతని ప్రతిభని చూసి 'రావణాసుర' సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా విజయం పట్ల రవితేజతో పాటు మిగతా టీమ్ అంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమా విజయం అనేది సుధీర్ వర్మకు చాలా కీలకం. ఈ సినిమా హిట్ అయితే, ఆయన దర్శకుడిగా మరో మెట్టు ఎక్కే అవకాశముంది. పొరపాటున ఫ్లాప్ అయితే, ఆయనపై ఫ్లాప్ డైరెక్టర్ అనే ముద్ర పడే ఛాన్స్ ఉంది. మరి 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ.. సుధీర్ వర్మకు హిట్ అందిస్తాడేమో చూడాలి.