English | Telugu
గోపీచంద్ పై అల్లరి నరేష్ ఉగ్రరూపం!
Updated : Apr 3, 2023
'నాంది' తరువాత నటుడు అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఉగ్రం'. ఒకప్పుడు కామెడీ హీరోగా అలరించిన నరేష్.. 'నాంది' నుంచి రూట్ మార్చాడు. విభిన్న చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'ఉగ్రం' టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ గా టీజర్ లో నరేష్ ఉగ్రరూపం చూపించాడు. నరేష్-విజయ్ కాంబో మరో విజయాన్ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ హిట్ కాంబో మరో హిట్ కాంబోని ఢీ కొట్టబోతోంది.
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే తేదీకి 'ఉగ్రం' కూడా రాబోతోంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఒకే విడుదల తేదీకి వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.