English | Telugu
'SSMB 29' మొదలయ్యేది అప్పుడే!
Updated : Oct 10, 2023
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'SSMB 29'. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందనున్న మొదటి సినిమా ఇది. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజమౌళి నుంచి రానున్న తదుపరి సినిమా కావడంతో.. 'SSMB 29'పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టి ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్న మహేష్.. అది పూర్తయ్యాక 'SSMB 29' ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కానున్నాడు. అయితే 'గుంటూరు కారం', 'SSMB 29'కి మధ్యలో మహేష్ మరో ప్రాజెక్ట్ కూడా చేసే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. 'గుంటూరు కారం' తర్వాత మహేష్.. రాజమౌళి సినిమానే చేయనున్నాడట. 2024, ఏప్రిల్ నుంచి 'SSMB 29' వర్క్ స్టార్ట్ కానుందని సమాచారం.
మహేష్ ప్రస్తుతం 'గుంటూరు కారం'ని చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా 2024, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత మహేష్ తన పూర్తి దృష్టిని 'SSMB 29'పైనే పెట్టనున్నాడు. ముందుగా తన బాడీని రాజమౌళి సినిమాకి తగ్గట్టుగా దృఢంగా మలచనున్నాడు.