Read more!

English | Telugu

మహేష్, త్రివిక్రమ్.. ఓ అమ్మ కథ!

'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూడో చిత్రం 'SSMB 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 'అమ్మ కథ' అనే టైటిల్ తెరపైకి వచ్చింది.

త్రివిక్రమ్ కొన్నేళ్లుగా 'అ' సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఆయన గత నాలుగు చిత్రాల టైటిల్స్ అ అక్షరంతోనే మొదలవుతాయి. ఇప్పుడు మహేష్ చిత్రానికి ఆయన అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారట. 'SSMB 28'కి 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. ఆ తరువాత 'అతడే తన సైన్యం', 'అర్జునుడు' వంటి టైటిల్స్ వినిపించాయి. ఇటీవల 'ఆరంభం' అనే టైటిల్ కూడా బాగానే వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకి 'అమ్మ కథ' అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో తల్లి పాత్ర చాలా కీలకమని, కథ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని.. అందుకే 'అమ్మ కథ' టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ ఏమాత్రం పవర్ ఫుల్ గా లేదని ఫైర్ అవుతున్నారు.

అయితే ఈ చిత్రానికి 'అమ్మ కథ' అనే టైటిల్ ఖరారు చేశారనే వార్తల్లో వాస్తవం లేదని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మహేష్, త్రివిక్రమ్ సహా మూవీ టీమ్ అంతా 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ కే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ ఉగాదికి చిత్ర టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం.