English | Telugu
'SSMB 29' లాంచ్ కి ముహూర్తం ఖరారు!
Updated : Jun 13, 2023
అధికారిక ప్రకటన కూడా రాకుండానే దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'ఎస్ఎస్ఎంబి 29'. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న తదుపరి సినిమా కావడంతో పాటు, రాజమౌళి-మహేష్ కలయికలో రూపొందనున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
మహేష్ ప్రస్తుతం తన 28వ సినిమా 'గుంటూరు కారం'ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన 29వ సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం కేవలం మహేష్ అభిమానులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదొక జంగిల్ అడ్వెంచర్ ఫిల్మ్ అని ఇప్పటికే హింట్ ఇవ్వడంతో.. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ని మించి పాన్ వరల్డ్ రేంజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారంతా. ఇక ఈ మూవీ లాంచ్ వేడుక ఘనంగా జరగనుందట. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9 న ఈ మూవీని అధికారికంగా ప్రకటించడంతో పాటు, అదేరోజున పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేయనున్నారని సమాచారం. అయితే ఆగస్ట్ 9 న లాంచ్ అయినప్పటికీ సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పట్టే అవకాశముంది. ఓ వైపు మహేష్ 'గుంటూరు కారం' షూటింగ్ పూర్తి చేయాలి, మరోవైపు రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్క్రిప్ట్ మీద కూర్చోవాలి. ఆలస్యమైనా పూర్తిగా సన్నద్దమయ్యాకే షూటింగ్ కి వెళ్లడం రాజమౌళి కి అలవాటు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశముంది.