English | Telugu
‘నారప్ప’ తరహాలో శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న మరో ప్రయత్నం ‘పెదకాపు 1’
Updated : Sep 5, 2023
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అనగానే మనకు గుర్తొచ్చే సినిమాలు ‘కొత్త బంగారులోకం’, ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ రెండు సినిమాలతో సెన్సిటివ్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. అతని సినిమాల్లోని కంటెంట్, మేకింగ్ నచ్చి వెంటనే ‘బ్రహ్మోత్సవం’ చేసే అవకాశం ఇచ్చాడు మహేష్. కానీ, శ్రీకాంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మహేష్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా ఆ చిత్రాన్ని నిలబెట్టాడు. దాంతో అతనికి డైరెక్టర్‌గా అవకాశాలు సన్నగిల్లాయి. చాలా గ్యాప్ తర్వాత ఒక రీమేక్ చేసే అవకాశం ఇచ్చాడు వెంకటేష్. అదే ‘నారప్ప’. తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో అదే ఇంపాక్ట్‌తో తీసి సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్. అయితే కోవిడ్ సమయంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దాంతో శ్రీకాంత్ కష్టం వృధా అయింది.
ఇప్పుడు మరో ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. తనకు బంధువైన విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ ‘పెదకాపు 1’ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో పూర్తి యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ని కూడా చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లోని సీన్స్ ‘నారప్ప’ చిత్రాన్ని పోలి ఉండడం గమనించాల్సిన విషయం. ఆ సినిమాతో అంత గుర్తింపు రాకపోవడంతో మరోసారి అలాంటి సినిమా చేసి థియేటర్లలో చప్పట్లు కొట్టించుకోవాలని ప్లాన్ చేసినట్టున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులతో ఒక సామాన్యుడి పోరాటమే ఈ సినిమా. అయితే ఈ సినిమాకి ‘పెదకాపు 1’ అని టైటిల్ పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? దీనికి సీక్వెల్‌గా పార్ట్ 2 కూడా ఉండే అవకాశం వుందా అనేది తెలియాల్సి ఉంది. ‘అఖండ’తో భారీ విజయాన్ని అందుకున్న మిర్యాల రవీందర్‌రెడ్డి ద్వారక క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ఇది. హీరోకి ఇదే మొదటి సినిమా అయినా టెక్నికల్‌గా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి. మార్తాండ్ కె.వెంకటేష్, మిక్కీ జె.మేయర్, ఛోటా కె.నాయుడు, పీటర్ హెయిన్స్... ఇలా టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళి ఆదరణ పొందే అవకాశం కనిపిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.