English | Telugu
శ్రీ రాముడిగా నందమూరి బాలకృష్ణ
Updated : Aug 16, 2011
శ్రీ రాముడిగా నందమూరి బాలకృష్ణ మేకప్ లో ఎలా ఉంటాడోనన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన శ్రీ రామచంద్ర మూర్తిగా అద్భుతంగా ఉంటాడని ఇక్కడున్న ఫొటో చూస్తే అర్థమవుతుంది. శ్రీరామచంద్రుడంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారకరామారావు అని అఖిలాంధ్రులు ఏకగ్రీవంగా ఆమోదించే విషయం. ఆ వేషానికి ఆ స్థాయిని తెచ్చి పెట్టారు యన్ టి ఆర్. కానీ శ్రీ రాముడిగా నందమూరి నటసింహం బాలకృష్ణను చూస్తే తండ్రికి తగ్గ నటవారసుడని ఘంటాపధంగా చెప్పవచ్చు.
ఇంతకీ బాలకృష్ణ ఈ శ్రీ రాముడి వేషం ఏ సినిమాలో వేశాడనేగా మీ అనుమానం. బాపు దర్శకత్వంలో, యువరత్న బాలకృష్ణ శ్రీరామచంద్రమూర్తిగా, నయనతార సీతామహాసాధ్విగా, శ్రీకాంత్ లక్ష్మణుడిగా, సాయి కుమార్ భరతుడిగా, బాలయ్య దశరథ మహారాజుగా, మురళీ మోహన్ జనక మహారాజుగా, నటసామ్రాట్, పద్మవిభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటిస్తూండగా, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న పౌరాణిక కళాఖండం "శ్రీ రామరాజ్యం". ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో నిన్ననే భద్రాచలంలో శ్రీరామచంద్రులవారి సన్నిధిలో విడుదలయ్యింది. ఆ "శ్రీ రామరాజ్యం" సినిమాలోనిదే ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టిల్. ఈ స్టిల్ చూసి శ్రీ రామచంద్రమూర్తిగా నందమూరి బాలకృష్ణ ఎంతబాగా కుదిరారో మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.