English | Telugu

సిక్స్ ప్యాక్‌తో ఫ్యామిలీ హీరో శివ కార్తికేయ‌న్‌.. ఫొటో లీక్‌

కోలీవుడ్ హీరో శివ కార్తికేయ‌న్‌కు ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. కామెడీ, ఎమోషన్స్ క‌ల‌గ‌లిసిన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చిన శివ కార్తికేయ‌న్ ఇప్పుడు త‌మిళ‌నాడులో అయితే డాన్ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల హీరోగా మారిపోయారు. ఇప్పుడు త‌మిళంతో పాటు తెలుగు మార్కెట్‌పై కూడా క‌న్నేశారు. తెలుగులోనూ త‌న సినిమాల‌ను విడుద‌ల‌య్యేలా చూసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. తాజాగా ఈ క‌థానాయ‌కుడు మ‌రో వ‌ర్గం ప్రేక్ష‌కులైన మాస్ ఆడియెన్స్‌ను కూడా ఆక‌ట్టుకోవ‌టానికి రెడీ అయ్యారు. అదెలా అనే సందేహం రావ‌చ్చు. అస‌లు విష‌యం ఏంటంటే.. ఇప్పుడు శివ కార్తికేయ‌న్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. SK 21 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా తెర‌కెక్కుతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి లీకైన ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ ఫొటో ఏంటో తెలుసా!.. శివ‌కార్తికేయ‌న్ అందులో సిక్స్ ప్యాక్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న శివ కార్తికేయ‌న్‌.. ఇప్పుడు మాస్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసే సిక్స్ ప్యాక్ చేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న రివీల్ చేస్తార‌ని కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. ఈ సినిమాలో వెర్స‌టైల్ యాక్ట్రస్ సాయి పల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌మ‌ల్ హాస‌న్‌, ఆర్‌.మ‌హేంద్ర‌న్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు జి.వి.ప్ర‌కాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి మ‌న హీరో క‌ష్టం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్ర‌స్తుతానికి సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.