English | Telugu
ఆహాలో 'సామజవరగమన' సందడి!
Updated : Jul 21, 2023
పెద్దగా అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సామజవరగమన' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 29 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మూడు వారాల్లో రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'సామజవరగమన' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నెలరోజులలోపే జూలై నాలుగో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని తాజాగా ఆహా ప్రకటించింది. "నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం.. ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం" అంటూ 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ని ఇచ్చింది ఆహా. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ దక్కించుకుంటుందేమో చూడాలి.