English | Telugu
'సలార్' ప్లేస్ లోకి 'రూల్స్ రంజన్'!
Updated : Sep 4, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. ఈ సినిమా మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. అయితే సీజీ వర్క్ పట్ల దర్శకుడు అసంతృప్తిగా ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి మరింత సమయం తీసుకోవాలన్న ఉద్దేశంతో సినిమాని వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీ వర్గాల మాట. నవంబర్ కి సినిమా వాయిదా పడిందని, అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని అంటున్నారు.
అధికారిక ప్రకటన రానప్పటికీ 'సలార్' వాయిదా ఖరారు కావడంతో.. సెప్టెంబర్ 28 తేదీపై మిగతా సినిమాలు కన్నేశాయి. ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ తమ 'మ్యాడ్' చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన రామ్ పోతినేని, బోయపాటి శ్రీనుల పాన్ ఇండియా ఫిల్మ్ 'స్కంద'ని సెప్టెంబర్ 28 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఆ తేదీపై 'రూల్స్ రంజన్' కూడా కర్చీఫ్ వేసింది.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 28న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఈరోజు(సెప్టెంబర్ 4న) ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా వెల్లడించారు. మరి 'సలార్' విడుదల కావాల్సిన సెప్టెంబర్ 28న విడుదలవుతున్న 'రూల్స్ రంజన్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.