English | Telugu
రవితేజ రాబోయే సినిమాల్లో దానికి ఏ లోటూ ఉండదట!
Updated : Nov 2, 2023
తన కామెడీతో, యాక్షన్‌తో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ ఒకటి రెండు సినిమాలతో ఆ బిరుదును దక్కించుకోలేదు. దాని వెనుక ఎంతో కృషి ఉంది. మెగాస్టార్ చిరంజీవి తరహాలో ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం తన స్వయంకృషితో ఆ స్థానాన్ని దక్కించుకోగలిగాడు. మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన రవితేజ మంచి అవకాశం కోసం ఎదురుచూశాడు. మొదట్లో శ్రీను వైట్లతో ‘నీకోసం’ వంటి లవ్ అండ్ యాక్షన్ మూవీ చేసిన రవితేజ అదే శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తన ట్రెండ్ మార్చి ‘వెంకీ, ‘దుబాయ్ శీను’ వంటి సినిమాల్లో కామెడీ పండిస్తూనే యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాల్లోని యాక్షన్, కామెడీ అతన్ని మాస్ మహారాజాని చేశాయి. యాక్షన్ పార్ట్‌కు న్యాయం చేస్తూనే కామెడీని కూడా బాగా పండిరచడం వల్లే అతని సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. హీరోగా అతని రేంజ్‌ని పెంచాయి. అతను ఏ సినిమా చేసినా కామెడీని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. ఏ సినిమాలను ఆదరించినా, ఆదరించకపోయినా కామెడీ సినిమాలను మాత్రం ఆడియన్స్ ఎప్పుడూ సూపర్‌హిట్ చేస్తారు. ఒకవిధంగా రవితేజ అంత సక్సెస్‌ఫుల్ హీరో అయింది కూడా కామెడీ వల్లే. అయితే ఈమధ్యకాలంలో రవితేజ చేస్తున్న సినిమాల్లో కామెడీ పూర్తిగా తగ్గిపోతోందని, ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్లే చెయ్యడం వల్ల అంతకుముందు రవితేజను చూస్తున్న ఫీల్ కలగడం లేదని ఆడియన్స్ ఆరోపిస్తున్నారు. ఆ నోటా ఈ నోటా ఈ మాట రవితేజ వరకు వెళ్లినట్టుంది. అందుకే తన రూటు మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు’లో కామెడీని జొప్పించే అవకాశం లేదు. దీంతో రవితేజ ఒక్క సీన్‌లో కూడా నవ్వించిన పాపాన పోలేదు. దానికి తగ్గట్టుగానే సినిమా అందర్నీ నిరాశపరచింది. దీంతో తన తప్పు తెలుసుకున్న రవితేజ తనను ఇంతటి వాడిని చేసిన కామెడీని పక్కన పెట్టకూడదని నిర్ణయించుకున్నాడట. అందుకే తన నెక్స్‌ట్ మూవీ ‘ఈగిల్’లో కామెడీ డోస్‌ని ఇంకా పెంచమని ఆర్డర్స్ పాస్ చేసినట్టు తెలుస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ వాయిదా పడిరదని, జనవరి 26న రవితేజ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ ఆ వార్తల్లో నిజంలేదని, తమ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా తర్వాత రవితేజ చేసే సినిమాల్లో కామెడీ తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు రవితేజ సిద్ధమవుతున్నాడు. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే అనిల్ రావిపూడితో ‘రాజా ది గ్రేట్’ వంటి సూపర్‌హిట్ మూవీ చేసిన రవితేజ దాన్ని మించే రేంజ్‌లో ఉండే సబ్జెక్ట్‌తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అలాగే హరీష్ శంకర్‌తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా కామెడీకే ప్రాధాన్యం ఉండేలా చూడమని హరీష్‌కు రవితేజ సూచించాడని తెలుస్తోంది. దీన్నిబట్టి రాబోయే సినిమాల్లో తన కామెడీతో మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి మాస్ మహారాజా రవితేజ ఎంతగా కృషి చేస్తున్నాడో అర్థమవుతుంది.