English | Telugu
'రానా నాయుడు'.. ఓవైపు బూతు అంటూ ట్రోల్స్, మరోవైపు టాప్ లో ట్రెండ్!
Updated : Mar 12, 2023
బాబాయ్ అబ్బాయిలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రలు పోషించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా నటించిన ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. మాములుగా వెంకటేష్ సినిమాలంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటాయి.. కానీ ఈ సిరీస్ మాత్రం ఒంటరిగా చూడాలని విడుదలకు ముందే టీం క్లారిటీ ఇచ్చింది. విడుదలయ్యాక ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'రానా నాయుడు' సిరీస్ లో అభ్యంతరకర సన్నివేశాలు, అసభ్య పదజాలం మితిమీరి ఉండటంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. వెంకటేష్ విభిన్న జోనర్లలో సినిమాలు చేసినప్పటికీ ఆయనకు ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ ఉంది. ఆయన సినిమా చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాంటి వెంకటేష్ తన ఇమేజ్ ని పక్కనబెట్టి ఇలాంటి సిరీస్ చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ 'రానా నాయుడు'కి అదిరిపోయే ఆదరణ లభిస్తుండటం విశేషం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ షోలలో 'రానా నాయుడు' టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్న రానా.. ఈ సిరీస్ ని ప్రేమిస్తున్న వారికి థాంక్స్, ద్వేషిస్తున్న వారికి సారీ అంటూ ట్వీట్ చేశాడు.