English | Telugu

'ప్రాజెక్ట్ కె'లో రాజమౌళి.. టార్గెట్ 5000 కోట్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2989 ఏడీ'. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 'ప్రాజెక్ట్ కె'గా ప్రచారం పొందింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్న ఒక్కో న్యూస్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

ఇప్పటికే 'కల్కి 2989 ఏడీ'లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయని, దుల్కర్ సల్మాన్ సహా వివిధ భాషలకు చెందిన పలువురు స్టార్స్ సందడి చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నారని సమాచారం. 'బాహుబలి'తో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన ఘనత రాజమౌళి సొంతం. అందులో ఆయన ఒక సన్నివేశంలో కనిపించి అలరించారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కె లో అతిథి పాత్రలో మెరవనున్నారు అంటున్నారు. మరి రాజమౌళి హ్యాండ్ ప్రభాస్ కి మరోసారి కలిసొస్తుందేమో చూడాలి.

'బాహుబలి-2' రికార్డులను బ్రేక్ చేయగల సత్తా సినిమా 'కల్కి 2989 ఏడీ' అని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇది అసలుసిసలు పాన్ వరల్డ్ మూవీ అని, వరల్డ్ వైడ్ గా వెయ్యి, రెండు వేల కోట్లు కాదు.. రూ.5000 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఖాయమని మూవీ టీంతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. అసలే బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికితోడు వివిధ భాషలకు చెందిన బిగ్ స్టార్స్ తోడయ్యారు. ఇప్పుడు రాజమౌళి గెస్ట్ రోల్ న్యూస్. రోజురోజుకి ఈ సినిమాపై పెరుగుతున్న హైప్ చూస్తుంటే.. పాజిటివ్ టాక్ వస్తే రూ.5000 కోట్లు రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది.