English | Telugu
రెండో రోజుకే పూర్తిగా చేతులెత్తేసిన 'ఏజెంట్'.. 'పిఎస్-2'దే పైచేయి!
Updated : Apr 30, 2023
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఏజెంట్'. మమ్మూట్టి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇక రెండో రోజు పూర్తిగా చేతులెత్తేసింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమా 'పొన్నియిన్ సెల్వన్-2'కి వచ్చిన దానిలో సగం కూడా రాబట్టలేకపోయింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'ఏజెంట్', 'పొన్నియిన్ సెల్వన్-2' సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ఆకట్టుకోకపోవడంతో.. రెండో భాగంపై తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏజెంట్ రూ.4 కోట్ల షేర్ రాబట్టగా.. 'పిఎస్-2' రూ.1.37 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక రెండు రోజు సీన్ రివర్స్ అయింది. ఏజెంట్ కేవలం 67 లక్షల షేర్ రాబట్టగా.. పిఎస్-2 మాత్రం ఏకంగా 1.58 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ పై పిఎస్-2 పైచేయి సాధించేలా ఉంది.
రూ.37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఏజెంట్.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.4.95 కోట్ల షేర్ తో పరవాలేదు అనిపించుకుంది. రెండో రోజు మాత్రం రూ.81 లక్షల షేర్ రాబట్టి దారుణంగా నిరాశపరిచింది. దీంతో రెండు రోజుల్లో రూ. 5.76 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 31 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో కోటి, రెండు కోట్లకు మించి రాబట్టేలా లేదు. అదే జరిగితే దాదాపు 30 కోట్లు లాస్ వచ్చినట్టు అవుతుంది.
'ఏజెంట్' కి ఫ్లాప్ టాక్, దారుణమైన కలెక్షన్స్ రావడం పట్ల అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 2015 లో విడుదలైన 'అఖిల్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. భారీ అంచనాలతో విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఎనిమిదేళ్ల కెరీర్ లో మొత్తం ఐదు సినిమాలు చేశాడు అఖిల్. అందులో ఒక్క 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తప్ప.. మిగతా నాలుగు ఘోర పరాజయాలే. ముఖ్యంగా ఏజెంట్ చిత్రం అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచేలా ఉంది.