English | Telugu
అల్లరి నరేష్ దర్శకుడితో నాగ చైతన్య మూవీ!
Updated : Apr 30, 2023
అల్లరి నరేష్ హీరోగా నటించిన 'నాంది'తో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కనకమేడల తన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. దర్శకుడిగా తన రెండో సినిమా 'ఉగ్రం' కూడా నరేష్ తోనే చేశాడు. ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తన మూడో సినిమాని నాగ చైతన్యతో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి 'నాంది' తర్వాత చైతన్యకు ఒక కథ చెప్పాడు విజయ్. ఆ కథ చైతన్యకు బాగా నచ్చింది. అయితే క్లైమాక్స్ విషయంలో ఇద్దరికి సంతృప్తి లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ క్రమంలో విజయ్ 'ఉగ్రం'పై దృష్టి పెట్టగా.. చైతన్య కూడా వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' సినిమాతో బిజీ అయ్యాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే ఉగ్రం చిత్రీకరణ సమయంలో.. చైతన్యకి చెప్పిన కథ క్లైమాక్స్ విషయంలో విజయ్ కి అదిరిపోయే ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం విజయ్ రైటింగ్ టీం ఆ కథ క్లైమాక్స్ పైనే వర్క్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే చైతన్య-విజయ్ కాంబినేషన్ లో సినిమాకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది అంటున్నారు.