English | Telugu
చిక్కుల్లో 'భోళా శంకర్' నిర్మాత!
Updated : Aug 4, 2023
'ఊళ్ళో ఉన్న దరిద్రం అంతా నీ నెత్తి మీదే ఉంది' అన్నట్లుగా తన పాత సినిమాల వివాదాలు అన్నీ 'భోళా శంకర్' నిర్మాత అనిల్ సుంకరను ఒకేసారి చుట్టుముడుతున్నాయి. 'మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేశాను.. త్వరలోనే విడుదల.. ముందుందీ మెగా పండుగ' అని సంతోషంలో ఉన్న అనిల్ సుంకరకు వరుస షాక్ లు తగులుతున్నాయి. కొత్త సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ, పాత సినిమాల కష్టాలు వెంటాడుతున్నాయి.
2018లో అభిషేక్ నామ, టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన 'గూఢచారి' సినిమాకి అనిల్ సుంకర డిస్ట్రిబ్యూటర్. ఆ సమయంలో వీరి మధ్య లెక్కలు తేలలేదట. ఓ వైపు 'గూఢచారి-2' ని ప్రకటించి, ఆ నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఏకంగా ఐదేళ్ల తర్వాత అనిల్ సుంకరతో ఉన్న 'గూఢచారి' లెక్కల పంచాయితీ కోసం ఆ చిత్ర నిర్మాతలు.. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ దగ్గరకు వెళ్లారట. అయితే 'గూఢచారి' నిర్మాణ భాగస్వాముల్లో ఒకరైన అభిషేక్ నామకి మాత్రం దీనితో పాటు అనిల్ సుంకరతో మరో సమస్య ఉంది. అదేంటంటే క్రియేటివ్ కమర్షియల్స్(కె.ఎస్.రామారావు) నిర్మించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాన్ని అభిషేక్ నామ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ లెక్కలను కె.ఎస్.రామారావు తాను అనిల్ సుంకరతో కలిసి నిర్మిస్తున్న 'భోళా శంకర్'తో సెట్ చేస్తానని చెప్పారట. నిజానికి 'భోళా శంకర్' చిత్రాన్ని ప్రకటించినప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ల పేర్లు పోస్టర్స్ పై కనిపించాయి. ఆ తర్వాత కొంతకాలానికి క్రియేటివ్ కమర్షియల్స్ పేరు మాయమైంది. అయితే కె.ఎస్.రామారావు కి సహకరించేలా కావాలనే క్రియేటివ్ కమర్షియల్స్ పేరుని ప్రమోషన్స్ లో లేకుండా చేశారనే భావనలో అభిషేక్ నామ ఉన్నారట. అందుకే 'భోళా శంకర్' విడుదలకు ముందే తన లెక్కలు సరిచేసేలా ఛాంబర్ కి ఫిర్యాదు చేస్తున్నారట. తనకు 'గూఢచారి' లెక్కలతో సమస్య లేదని, 'వరల్డ్ ఫేమస్ లవర్' లెక్కలే అసలు సమస్య ఆయన చెబుతున్నట్లు సమాచారం.
ఇలా తాను డిస్ట్రిబ్యూట్ చేసిన 'గూఢచారి', తనకు సంబంధం లేని 'వరల్డ్ ఫేమస్ లవర్' వివాదాలు 'భోళా శంకర్' విడుదల వేళ అనిల్ సుంకరని చుట్టుముడుతున్నాయి. దీంతో 'భోళా శంకర్' విడుదలై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది చాలదు అన్నట్లుగా తాను నిర్మించిన 'ఏజెంట్' సినిమా కష్టాలు కూడా అనిల్ సుంకరని వెంటాడుతున్నాయి. ఏజెంట్ సినిమా హక్కులు 30 కోట్లకు కొని తాను దారుణంగా నష్టపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బయ్యర్ వైజాగ్ సతీష్ కోర్టుని ఆశ్రయించారు. మరి ఈ చిక్కుల నుంచి నిర్మాత అనిల్ సుంకర ఎలా బయటపడతారో చూడాలి.