English | Telugu
ఆ విషయంలో అట్లీ మోసం చేశాడు: ప్రియమణి
Updated : Sep 16, 2023
జాతీయ అవార్డ్ గ్రహీత నటి ప్రియమణి ఓ దర్శకుడిపై కోపంగా ఉంది. ఇంతకీ ఆమెకు కోపం తెప్పించిన సదరు దర్శకుడు ఎవరా అని అనుకుంటున్నారా?.. తనే డైరెక్టర్ అట్లీ. అదేంటి రీసెంట్‌గా రిలీజైన జవాన్ సినిమాలో ప్రియమణి నటించిందిగా. మళ్లీ ఇప్పుడు తనపైనే ప్రియమణి ఎందుకు కోపంగా ఉందనే సందేహం రావచ్చు. వివరాల్లోకి వెళితే, జవాన్ సినిమాలో షారూఖ్ పాత్రను సపోర్ట్ చేసే లేడీ ఆర్మీలో కీలకమైన లక్ష్మి అనే పాత్రలో ప్రియమణి నటించింది. యాక్షన్ ఎలిమెంట్స్‌లో ఆమె చాలా కష్టపడి నటించింది. ఆమె పాత్రకు మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. ఈ పాత్రను చేయాలంటూ ప్రియమణి దగ్గరకు అట్లీ వెళ్లి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె ఓ కండీషన్ పెట్టింది.
ఇంతకీ అట్లీకి ప్రియమణి ఏం కండీషన్ పెట్టిందో తెలుసా.. ప్రియమణికి జవాన్ కథను అట్లీ నెరేట్ చేసేటప్పుడు అందులో ఓ ముఖ్య పాత్రలో దళపతి విజయ్ కనిపిస్తారని చెప్పాడు. విజయ్‌కి పెద్ద ఫ్యాన్ అయిన ప్రియమణి, తనతో కలిసి నటించటానికి అవకాశం ఇవ్వాలని కనీసం ఓ సీన్‌లో అయిన విజయ్‌తో కలిసి నటిస్తానని రిక్వెస్ట్ చేసిందట. అలాగే చేస్తానని ప్రియమణికి అట్లీ మాటిచ్చాడు. కానీ దళపతి విజయ్ జవాన్ చిత్రంలో నటించలేదు. దీంతో ప్రియమణి కోరిక తీరనేలేదు. ఆ విషయంలో అట్లీ తనను మోసం చేశాడంటూ ప్రియమణి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మరి.
ఇక జవాన్ విషయానికి వస్తే షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రూ.700 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా అడుగులు వేస్తూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది పఠాన్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారూఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్‌తో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు మరి.