English | Telugu
తెలుగు చిత్రసీమపై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
Updated : Oct 22, 2023
69వ జాతీయ అవార్డుల వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. 69వ ఏళ్ల సినీ చరిత్రలో ఇంతకు ముందు ఎవరూ సాధించని ఘనతను బన్ని సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా ఢిల్లీలో అల్లు అర్జున్ వెళ్లి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. హైదరాబాద్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. పుష్ప ది రైజ్ సినిమాలో బన్ని నటనకు జాతీయ ఉత్తమనటుడుగా అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఘనంగా సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సెలబ్రేషన్స్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలను చేశారు. ఇంతకీ ఆయనేమన్నారంటే ‘‘అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవటం అనేది చిత్ర పరిశ్రమ ఎంతో గర్వించాలి. పాతికేళ్ల ముందు అంతఃపురం చిత్రానికి నాకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. మళ్లీ ఇప్పుడు అవార్డు రావటం ఆనందించాల్సిన విషయం. అయితే ఇంత పెద్ద సాధన సాధించిన తర్వాత తెలుగు చిత్ర సీమ ఎందుకు కలిసి రావటం లేదు. బన్నికి అవార్డ్ రావటం అంటే తెలుగు నటీనటులందరూ గర్వించాల్సిన విషయం. అలాగే రాజమౌళి తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారు. అందులో పని చేసినా, చేయకపోయినా మనం గర్వపడాల్సిన విషయం.
అలాగే దేవిశ్రీ ప్రసాద్‌కు అవార్డ్ గర్వించాల్సిన విషయం. కానీ ఎందుకనో మనం శ్లాఘించటం అనే విషయాన్ని మరచిపోయాం. బన్నీతో గంగోత్రి చేస్తున్నప్పుడు తను గొప్ప నటుడవుతాడనే విషయాన్ని నేను అరవింద్‌గారికి చెప్పాను. తను ఊరకనే గొప్ప స్థాయికి రాలేదు. ఎంతో కష్టపడ్డాడు. తనకు అవార్డు రావటం చూస్తుంటే నా కొడుక్కి వచ్చినట్లు అనిపించింది. ఈరోజు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇది మనమందరం గర్వపడాల్సిన క్షణాలు. సరిహద్దులు దాటేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్లను మనమే గౌరవించుకోవాలి. దాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలి’’ అన్నారు ప్రకాష్ రాజ్.