English | Telugu
కృష్ణంరాజు విగ్రహాన్ని చూసి ఉలిక్కిపడ్డ ప్రభాస్... ఎందుకో తెలుసా?
Updated : Oct 10, 2023
అప్పటి తరం హీరోల్లో కృష్ణంరాజుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారీ విగ్రహంతోపాటు చక్కని హావ భావాలు, పెరోషియస్ క్యారెక్టర్స్‌లో అతను చూపిన ప్రతిభ అప్పట్లో సంచలనంగా ఉండేది. అందుకే కృష్ణంరాజు రెబల్‌స్టార్ అయ్యారు. ఆయనకు ముగ్గురూ కుమార్తెలే ఉండడంతో తన తమ్ముడి కొడుకైన ప్రభాస్‌నే తన నటవారసుడిగా ప్రకటించారు కృష్ణంరాజు. తన కొడుకులాంటి ప్రభాస్ ఎదుగుదల చూసి అంతులేని ఆనందాన్ని పొందారాయన. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ కూడా కృష్ణంరాజుని కన్నతండ్రి కంటే ఎక్కువగా గౌరవించేవాడు. కొన్ని సినిమాల్లో ప్రభాస్‌తో కలిసి నటించి ఎంతో సంతృప్తిని పొందారు కృష్ణంరాజు. ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి కృష్ణంరాజు గత ఏడాది ఆయన కుటుంబాన్ని, అభిమానుల్ని శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయారు. కృష్ణంరాజు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అలాంటి మర్యాదలనే పుణికి పుచ్చుకున్న ప్రభాస్ ఆయన బాటలోనే నడుస్తారు. కృష్ణంరాజు చనిపోయిన రోజు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అంత బాధలోనూ వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి కృష్ణంరాజు వారసుడు అనిపించుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత కృష్ణంరాజు స్వగ్రామం అయిన మొగల్తూరులోఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా అభిమానులకు విందు ఏర్పాటు చేసిన ఘనత ప్రభాస్ కుటుంబానికే దక్కింది.
గత నెలలో కృష్ణంరాజు సంత్సరీకం జరిగింది. పిఠాపురానికి చెందిన ఓ అభిమాని కృష్ణంరాజు విగ్రహాన్ని ఆయన భార్య శ్యామలాదేవికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఈ విగ్రహంలో ఎంతో జీవకళ ఉంది. అందుకే ఆయన లేరన్న బాధ లేదు. ఆయన మా పక్కనే ఉన్నారన్న ఆనందంతో ఉన్నాను. ఈ విగ్రహాన్ని చూసి ప్రభాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి వెళ్లిపోయాడు. నిమిషంపాటు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ విగ్రహాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. నిజంగా పెదనాన్న వచ్చారా అనే ఫీలింగ్ అతనికి కలిగింది. విగ్రహాన్ని అందించిన అభిమానిని మెచ్చుకున్నాడు.
పెదనాన్న నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రెబల్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి, స్పిరిట్, డీలక్స్ రాజా వంటి భారీ సినిమాలు చేస్తూ పెదనాన్నను మించిన తనయుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. వీటిలో సలార్ ఈ సంవత్సరం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమైంది.