English | Telugu
అది కమ్మ అవార్డు.. అందుకే వద్దని చెప్పా!.. నంది అవార్డులపై పోసాని కామెంట్!!
Updated : Apr 7, 2023
గతంలో తనకు 'టెంపర్' సినిమాలో చేసినందుకు ఇచ్చిన నంది అవార్డును కమ్మ అవార్డుగా భావించినందునే దాన్ని తీసుకోనని చెప్పానని నటుడు, రచయిత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న పోసాని.. నంది అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నేను సినిమా ఇండస్ట్రీలో బాయ్‌గా ఉన్నప్పట్నుంచీ చూస్తున్నా.. ఒక్కో కాంపౌండ్‌కి ఇన్ని అని నందులు పంచుకొనేవాళ్లు. మీకు తెలుసు. నేనే రెండుసార్లు ఫైట్ చేశా. దాంతో పోసాని కృష్ణమురళి అనేవాడికి నంది అవార్డులు ఇవ్వకూడదు అనేది వచ్చేసింది. గాయం, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, ప్రేయసి రావే, ఆపరేషన్ దుర్యోధన.. లాంటి సినిమాలకు పనిచేశా. ఇందులో వేటికైనా నాకు నంది అవార్డ్ ఇచ్చారా? నేను రైటర్‌గా ఉన్నప్పుడే పేర్లు చెప్పి ఇంత అన్యాయంగా ఈ సినిమాకి ఇవ్వలేదు, ఎందుకు మూసేయండి అని చెప్పాను. నన్ను తిట్టడం తప్పితే రియలైజేషన్ లేదు." అని ఆయన అన్నారు.
"ఎన్టీఆర్ సినిమా 'టెంపర్'లో చేశా. నా ఖర్మకాలి ఇక తప్పదని నాకు నంది అవార్డు ప్రకటించారు. నాతో పాటు మిగతా వాళ్లవి చూశాను, ఎవరెవరికి ఏమిచ్చారో. ఆయా కాంపౌండులోకి నందులు వచ్చేశాయి. నాకు వచ్చినదాన్ని కమ్మ అవార్డుగా భావించా. ప్రెస్‌మీట్ పెట్టి ఈ అవార్డు నాకు వద్దని చెప్పా. 12 మంది జడ్జీల్లో 11 మంది కమ్మోళ్లు. తప్పేమీ లేదు, 12 మందీ కమ్మోళ్లు ఉండొచ్చు. కానీ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇది కులాలకీ, మతాలకీ సంబంధం లేని మేటర్. చాలామంది చెప్తుంటారు, ఇక్కడ కమ్మోళ్లు డామినేషన్, కాపోళ్ల డామినేషన్ అని. ఏమీ లేదు. ఇక్కడ డబ్బుదే డామినేషన్." అన్నారు పోసాని.
"చంద్రబాబు హయాం అప్పుడు 'మీరు ఈ ప్రభుత్వ నందులు ఇస్తామంటే, నేను పి. జనార్దన్‌రెడ్డి గారి దగ్గరకెళ్లి ప్రజా నందులు అనిపెట్టి అదేరోజు ఇప్పిస్తాన'ని ప్రకటన ఇచ్చా. జనార్దన్ రెడ్డి గారు కూడా 'తమ్ముడూ నువ్వు ఏం చెబితే అది చేస్తా' అన్నారు. ఈ విషయం చంద్రబాబు గారికి తెలిసింది. ఆయన వాళ్లను పిలిచి, తిట్టి, 'ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారా?' అన్నాడు. ఆ విషయం అంతటితో అయిపోయింది." అని చెప్పారు.
"ఈ నందులను పంచుకోవడం అనే విషయంలో నాకంటే మంచి రైటర్లు, నాకంటే మంచి డైరెక్టర్లు నాశనమైపోయారు. నేను కూడా అంత ఛండాలం చేయాలనుకోక, నాకు ఈ నంది వద్దని చేప్పేశాను. అప్పుడు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్న అంబికా కృష్ణను ఈ నందుల గురించి అడిగాను. ఏమండీ, నేను పేరుకే చైర్మన్‌ని. నా మాట విన్నారా, వాళ్లకు వాళ్లే పంచేసుకున్నారు అని ఆయన డైరెక్టుగా వేదిక మీదే అన్నారు. ఇంకేం చెప్పాలి? అందుకని ఈ నందుల్ని ఎలా ఇవ్వాలి? చంద్రబాబు నందుల్ని పంచుకోమని చెప్పకపోవచ్చు. కానీ కిందవాళ్లు రియలైజ్ అవ్వాలి. కానీ కావట్లేదు. వాళ్ల చేతుల్లో ఉంటే నందులు తెలీకుండా వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు వాటిని మా పాపం చేతుల్తో ఇవ్వాలంటే కష్టంగా ఉంది." అన్నారు పోసాని.
"పాతవి ఎప్పుడో అనౌన్స్ చేశారు, వాటిని ఎందుకివ్వలేదో కారణం తెలీదు. ఎందుకు ప్రతి సంవత్సరం (ఈ అవార్డులు) కాంట్రవర్సీ అవుతుంటాయి? జవాబు లేదు. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. నాలాగా చెప్తే, వచ్చే నంది కూడా వెళ్లిపోద్ది. అందుకని సీఎంతో మాట్లాడి.. ఆ పాతవి ఇవ్వాలా, లేక వాటిని పక్కనపెట్టి కొత్తగా ముందుకు వెళ్లాలా అనే విషయంలో కన్ఫ్యూజన్‌లో ఉన్నాం. అందువల్ల కొద్దిగా టైం ఇవ్వండి. నేను మంచి చేస్తానో, లేదో తెలీదు కానీ ఛండాలం మాత్రం చెయ్యను. అదైతే కన్ఫాం." అని పోసాని స్పష్టం చేశారు.