English | Telugu
రక్తపాతాన్ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్!
Updated : Sep 5, 2023
ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో ఆయన రేంజ్ కి తగ్గ హైప్ వచ్చిన సినిమా అంటే 'ఓజీ' అని చెప్పొచ్చు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై ప్రకటన నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలైన గ్లింప్స్ తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. పవర్ స్టార్ పూర్తిస్థాయిలో వయలెంట్ గా మారితే ఎలా ఉంటుందో చూపించడం కోసం శాంపిల్ గా గ్లింప్స్ ని వదిలినట్లుంది. "అతను నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాను కడగలేకపోయింది" అంటూ పవన్ పాత్రని ఎలివేట్ చేసిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 'ఓజీ' మాయ నుంచే ఇంకా ఫ్యాన్స్ బయటకు రావడం లేదంటే.. అంతకుమించిన వయలెన్స్ చూపించడానికి సిద్ధమవుతున్నారు పవన్.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ ని కట్టిపడేసింది. మరో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకాన్ని కలిగించింది. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో.. నెత్తురంటిన కత్తిని పట్టుకొని పవర్ ఫుల్ గా ఉన్న పవర్ స్టార్ స్టిల్ చూసి.. ఇందులో కూడా వయలెన్స్ ఉండబోతుందని అర్థమైంది. అయితే ఆ వయలెన్స్ మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండబోతుందని తాజాగా క్లారిటీ వచ్చింది. ఈరోజు నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' మాసివ్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలుపుతూ మేకర్స్ ఓ ఫొటోని విడుదల చేశారు. అందులో దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు.. కత్తులు, గొడ్డళ్లు, సుత్తి వంటి ఎన్నో మారణాయుధాలు ఉన్నాయి. చూస్తుంటే హరీష్ శంకర్ కూడా ఈసారి పూర్తిగా వయలెన్స్ బాట పట్టినట్లు అనిపిస్తోంది.
'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలను త్వరగా పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలని పవన్ చూస్తున్నారు. అంటే తక్కువ వ్యవధిలోనే పవన్ నుంచి రెండు వయలెన్స్ సినిమాలు రాబోతున్నాయన్నమాట. మరి ఈ రక్తపాతం పవన్ కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.