English | Telugu

పవన్ డైరెక్టర్ తో, పవన్ టైటిల్ తో నితిన్ సినిమా.. పెద్ద ప్లానే ఇది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినీ సెలబ్రిటీలలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకరు. అవకాశం దొరికినప్పుడల్లా పవన్ పై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు నితిన్. ఇప్పటిదాకా పవన్ పాటలను రీమిక్స్ చేయడం, పవన్ పాటలను టైటిల్స్ గా పెట్టుకోవడం చేసిన నితిన్.. ఇప్పుడు పవన్ దర్శకుడితో, పవన్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.

ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' సినిమా చేస్తున్న నితిన్ తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'కి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సూపర్ హిట్ ఫిలిమ్స్ లో ఒకటైన 'తమ్ముడు' టైటిల్ ని ఖరారు చేశారు. కొన్ని టైటిల్స్ బాధ్యతతో ముడిపడి ఉంటాయని, మీ అంచనాలకు మించే చిత్రాన్ని అందిస్తామని నితిన్ అన్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇప్పటిదాకా వచ్చిన మూడు సినిమాలు 'ఓ మై ఫ్రెండ్', 'ఎంసీఏ', 'వకీల్ సాబ్' లను దిల్ రాజు నిర్మించగా.. ఇప్పుడు నాలుగో సినిమా 'తమ్ముడు'ని కూడా ఆయనే నిర్మిస్తుండటం విశేషం. నిజానికి ఇది 'ఎంసీఏ'కి సీక్వెల్ అనే ప్రచారం ఉంది. 'ఎంసీఏ'లో నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగి అయిన వదినకి అండగా మరిది సాగించిన పోరాటం మనం చూశాం. అయితే ఈ సినిమా అక్కతమ్ముళ్ల కథతో తెరకెక్కనుందని, అందుకే తమ్ముడు అనే టైటిల్ ని పెట్టారని అంటున్నారు.