English | Telugu
చిరు అలా, బాలయ్య ఇలా.. సోషల్ మీడియాలో రచ్చ షురూ!
Updated : Aug 27, 2023
సినీ హీరోలు చేసే చిన్న చిన్న పనులు కూడా పెద్ద న్యూస్ అవుతుంటాయి. అవి హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తాయి. మేం మేం బానే ఉంటామని హీరోలు చెప్పినా.. ఫ్యాన్స్ మాత్రం మేం మేం గొడవపడతామని పదేపదే రుజువు చేస్తుంటారు. తాజాగా ఓ రెండు చిన్న ఘటనలు మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవకి దారితీసి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఆమధ్య 'భోళా శంకర్' ఈవెంట్ లో హీరోయిన్ కీర్తి సురేష్ ని చిరంజీవి హగ్ చేసుకున్న ఫోటోలు, ఆమెతో చిలిపిగా బిహేవ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చిరు చర్య వెనక ఏ దురుద్దేశం లేనప్పటికీ, చెల్లెలి పాత్ర చేసిన కూతురు వయసున్న హీరోయిన్ తో కుర్ర వేషాలు వేయడం ఏంటంటూ కొందరు తప్పుబట్టారు. అంతేకాదు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఆ విషయాన్ని అందరూ మర్చిపోతున్న వేళ బాలయ్య పుణ్యమా అని మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది.
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా 'స్కంద'. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాబోయే చిత్రం 'భగవంత్ కేసరి'లో కూతురు పాత్ర పోషిస్తున్న శ్రీలీలతో బాలయ్య ఆప్యాయంగా ముచ్చటించిన విధానం ఆకట్టుకుంది. కూతురుని దీవించినట్లుగా శ్రీలీల తలమీద చెయ్యి వేసి బాలయ్య దీవించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరైతే ఈ ఫోటోకి కీర్తి సురేష్-చిరంజీవి ఫోటోని జోడించి.. ఇది బాలయ్య సంస్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.