English | Telugu
పరశురామ్ దర్శకత్వంలో కార్తీ!
Updated : Feb 16, 2023
ఈ తరం తమిళ్ హీరోలు కొంతకాలంగా తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ 'ప్రిన్స్' చేయగా, వంశీ పైడిపల్లితో విజయ్ 'వారసుడు', వెంకీ అట్లూరితో ధనుష్ 'సార్' చేశారు. అయితే కార్తీ మాత్రం వీరందరి కన్నా ముందే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జునతో కలిసి 'ఊపిరి' సినిమా చేశాడు. ఇప్పుడు కార్తీ మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ పరశురామ్ ఇటీవల చెన్నై వెళ్లి కార్తీకి ఓ కథ వినిపించాడని, కథ నచ్చిన కార్తీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సినిమా రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సమయంలోనే ఓ తమిళ్ హీరోతో పరశురామ్ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి. ఆ హీరో ఎవరో కాదు.. కార్తీ అని ఇన్ సైడ్ టాక్.
కార్తీ ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్-2', 'జపాన్' సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు విజయ్ 'ఖుషి'తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. మరి పరశురామ్ ముందు విజయ్ ప్రాజెక్ట్ పూర్తి చేసి కార్తీ సినిమాతో బిజీ అవుతాడో లేక ముందే కార్తీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడో చూడాలి.