English | Telugu
ఈ కొత్త దర్శకుడి కోసం కర్చీఫ్‌లు వేస్తున్నారు!
Updated : Feb 11, 2023
ఒక డైరెక్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఆయా దర్శకులకు కర్చీఫులు వేయడం నిర్మాతలకు, హీరోలకు తెలుగులో చాలా సహజం. కానీ ఒక డైరెక్టర్ తీసిన సినిమా ఇంకా విడుదల కాకుండానే కేవలం ట్రైలర్ చూసి ఆ దర్శకుడిని లైన్ లో పెట్టాలని భావిస్తూ ఉండడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. కానీ ఇది వాస్తవం. విషయానికి వస్తే ప్రస్తుతం నాని దసరా అని చిత్రం చేస్తున్నారు. ఊర మాసివ్ అవతార్‌లో నాని కనిపిస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. సుకుమారు శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన దగ్గర నుంచి ఈ మూవీలో నాని లుక్, మేకోవర్ పై చర్చ జరుగుతుంది. రగ్గ్ఢ్ లుక్ లో నాని కనిపించడంతో అంత షాక్ అవుతున్నారు.
కీర్తి సురేష్ డీగ్లామర్ పాత్రలో కనిపిస్తోంది. మార్చి 30న సినిమా విడుదల కావాల్సి ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. టీజర్ లో యాక్షన్ ఘట్టాలు, నాని పలికిన సంభాషణలు, ఫైనల్ షాట్‌లో నాని తన చుట్టూ ఉన్న వారిని తెగ నరికి నోటితో కత్తి పట్టుకొని దానికి అంటిన రక్తాన్ని వీర తిలకంగా పెట్టుకుంటున్న తీరు ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేస్తుంది. దీంతో శ్రీకాంత్ ఓదోల గురించి ఎంక్వయిరీలు మొదలైపోయాయి. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని హీరోలు, నిర్మాతలు ఇప్పటినుంచే పోటీ పడుతున్నారు.
మొదటి చిత్రం విడుదల కాకుండానే ఆయన ముందు క్యూ కడుతున్నారు. టీజర్ వచ్చాక ఇది మరింత ఎక్కువగా అయింది. రా అండ్ రగ్గ్డ్ గా ఈ సినిమా ఉండనుండటంతో అందరూ శ్రీకాంత్ ఓదెల గురించే మాట్లాడుతున్నారు. అడ్వాన్స్ ఇచ్చి రిజర్వ్ చేసుకునే పనిలో ఉన్నారు. టీజర్ కార్యక్రమంలో నాని శ్రీకాంత్ ఓదెల గురించి గొప్పగా చెప్పడమే కాకుండా వేరే లెవల్ లో ఎలివేషన్ ఇచ్చారు. దాంతో నిర్మాతలు, హీరోలు ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దగ్గర క్యూ కడుతున్నారు. మరి శ్రీకాంత్ ఓదెలా భవిష్యత్తు ఏమిటో మార్చి 30వ తేదీన గాని చెప్పలేం. దసరా సాధించబోయే విజయంపై ఈ యువ దర్శకుడి భవితవ్యం ఆధారపడి ఉంది.