English | Telugu
ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు.. చరణ్ వెనకపడ్డాడు!
Updated : Dec 6, 2023
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం ఎన్టీఆర్ హీరోగా నటించాడు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మగధీర, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో రామ్‌చరణ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరికీ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకున్నారు. దేశ విదేశాల్లో ఈ సినిమాలోని రామ్, భీమ్ క్యారెక్టర్ల గురించి విపరీతమైన చర్చ జరిగిందంటే ఆయా క్యారెక్టర్లలో చరణ్, ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, చరణ్ చేస్తున్న సినిమాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి, మరోసారి తమ నటనతో మెస్మరైజ్ చేస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందని దర్శకుడు కొరటాల అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్‌చరణ్ చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్‌కి ముందే ప్రారంభమైంది. పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ అప్పుడప్పుడూ జరుగుతూ ఉంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే ‘దేవర’ చిత్రం కథా చర్చలు జరిగాయి. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. జనవరి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్‌లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దేవర రెండో భాగం షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేసి దాన్ని కూడా వీలైనంత త్వరగానే రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్2’ షూటింగ్ మార్చిలో మొదలవుతుంది. దేవర, వార్2 చిత్రాల షూటింగ్ విషయంలోగానీ, రిలీజ్ విషయంలోగానీ క్లారిటీ ఉంది. అలాగే ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఇంత స్పీడ్‌గా దూసుకెళ్తుంటే.. రామ్‌చరణ్ సినిమా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మందకొడిగా జరుగుతోంది.
గేమ్ ఛేంజర్ కారణంగానే చరణ్ తదుపరి సినిమాను ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ సినిమా ఇప్పటికే కన్‌ఫర్మ్ అయింది. కానీ, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. దీన్నిబట్టి రామ్‌చరణ్ సినిమాల విషయంలో ఎంత స్లో అయిపోయాడో అర్థమవుతోంది. దీంతో సినిమాల రేస్‌లో ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు, రామ్‌చరణ్ వెనకబడిపోయాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంతో నిరాశగా ఉన్నారు. తమ హీరో సినిమా థియేటర్స్‌లోకి ఎప్పుడు వస్తుందనే క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యానికి కారణం కమల్‌హాసన్ ఇండియన్ 2 అని తెలుస్తోంది. ఎప్పుడో ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన ఇండియన్ 2ని బయటికి తీసి షూటింగ్ మొదలు పెట్టడం వల్ల దాని ప్రభావం గేమ్ ఛేంజర్‌పై పడిరది. దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాల షూటింగ్ ఏకకాలంలో చెయ్యడం వల్ల దేనిమీదా ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్ చెయ్యలేకపోతున్నాడనే విమర్శ కూడా వినిపిస్తోంది. మరి గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందోననే బాధ మెగా ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.