English | Telugu
'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ వాయిదా!
Updated : Feb 20, 2023
'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభించి, మార్చి మూడో వారంలో షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో 'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో ఫిబ్రవరి 24న ఘనంగా ప్రారంభించాలి అనుకున్నారు. అయితే తారకరత్న మృతి చెందటంతో మూవీ లాంచ్ కొద్దిరోజులు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లాంచ్ వాయిదా పడినప్పటికీ షూటింగ్ మాత్రం ఆలస్యం కాదని.. మార్చిలో రెండో వారంలో మూవీని లాంచ్ చేసి, మూడో వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారని వినికిడి. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ పేర్లు ఖరారయ్యాయి. లాంచ్ సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
మరోవైపు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సైతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే మొదలు కావాల్సి ఉంది. కానీ తారకరత్న మృతితో కొద్దిరోజులు పాటు షూటింగ్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.