English | Telugu
'సార్'ది కూడా అదే పరిస్థితి.. నాగ చైతన్య ఏం చేస్తాడో?
Updated : Feb 14, 2023
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో పనిచేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు దర్శకులు మంచి మంచి కంటెంట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకునే విధంగా యూనివర్సల్ సబ్జెక్టులతో ముందుకు రావడమే దీనికి కారణం. ఇటీవలే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ 'వారీసు' అనే చిత్రం చేశారు. ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది కానీ తెలుగులో మాత్రం యావరేజ్ కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల యంగ్ కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ తమిళ తెలుగు భాషల్లో 'ప్రిన్స్' మూవీ చేశారు. ఈ చిత్రానికి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కె.వి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ 'సార్' అనే చిత్రం చేశారు. ఈ చిత్రం కూడా ద్విభాషా చిత్రంగా రూపొందింది. తెలుగులో 'సార్'గా విడుదల కాబోతున్న ఈ మూవీ తమిళంలో 'వాతి' పేరుతో రూపొందుతోంది. ఈ సినిమా 17వ తారీఖున తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంపై వెంకి అట్లూరి భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు. ఆయన గత చిత్రాలు సరిగా ఆడలేదు. ఆయన దర్శకత్వంలో గతంలో మూడు సినిమాలు రాగా 'తొలిప్రేమ' తప్పితే 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ధనుష్ చేయబోయే సార్ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. రొటీన్ స్టోరీ తో కాకుండా ఎడ్యుకేషన్ మాఫియా అనే నేపద్యంలో ఈ మూవీని ధనుష్ మార్క్ సినిమాగా తెరకెక్కించారు. సందేశాన్ని జోడించి కమర్షియల్ అంశాల నేపథ్యంలో సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సందేశాత్మక కథలు కష్టం అనేది కొందరి భావన అయితే మరికొందరు మాత్రం ఇలాంటి సందేశాత్మక, సమాజంలో జరుగుతున్న ఇబ్బందుల నేపథ్యంలో చిత్రాలు చేయడం అనేది మంచి విషయంగా భావిస్తున్నారు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతున్నారని మరో వర్గం వాదిస్తోంది.
గతంలో పలుసార్లు వాయిదా పడిన సార్ మూవీ ఫైనల్ గా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోంది. టీజర్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాకు పెద్దగా బజ్ లేదు. ఆ బజ్ క్రియేట్ అయితే గాని ప్రేక్షకులు థియేటర్లకు రారు. అలా థియేటర్లకు వస్తే గాని సినిమా మౌత్ టాకుతో హిట్ కాదు కాబట్టి ప్రమోషన్స్ ను మరింత వేగం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ చిత్రం కూడా తెలుగులో యావరేజ్ గా నిలిచి తమిళ్ లో భారీ విజయం సాధిస్తుందని వారీసు చిత్రం చూసిన వారికి అనిపిస్తోంది.
ఇక నాగచైతన్య పరిస్థితి దీనికి విభిన్నం. తెలుగు హీరో అయిన నాగచైతన్య తమిళ దర్శకుడైన వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో సీన్ రివర్స్ అయింది. తెలుగు హీరో తమిళ దర్శకునితో కలిసి పనిచేస్తూ ఉండటం ఇక్కడ గమనార్హం. మొత్తానికి ఇప్పుడు అనుకున్న చిత్రాలు తెలుగు, తమిళం రెండింటిలో విజయం సాధిస్తాయా? లేక ఏదో ఒక భాషకే పరిమితం అవుతాయా? అనేది వేచిచూడాలి.