English | Telugu

నిత్యా మీన‌న్.. డైరెక్ట్ ఓటీటీ

నిత్యా మీన‌న్ గురించి ప్ర‌త్యేకంగా సౌత్ సినీ ప్రేక్ష‌కుల‌కు చెప్పన‌క్క‌ర్లేదు. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పించ‌టానికి ఆమె ఎప్పుడూ మొగ్గు చూపుతుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌చ్చిన ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే ఓటీటీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌టానికి రెడీ అవుతోంది. వివ‌రాల్లోకి వెళితే, ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘కుమారి శ్రీమతి’. దీనికి గోమ‌టేశ్ ఉపాధ్యే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుద‌ల చేయ‌బోతున్నారు. దానికి సంబంధించిన డేట్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. అది కూడా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని మేక‌ర్స్ విడుద‌ల చేయ‌బోతున్నారు.

కుమారి శ్రీమ‌తి చిత్రంలో నిత్యామీన‌న్.. దేనికీ భ‌య‌ప‌డ‌ని అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది. అలా మొద‌లైంది వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ అమ్మ‌డు తెలుగులో భీమ్లా నాయ‌క్‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ఆమె తెలుగు సినిమా రిలీజ్ కాలేదు. తెలుగులో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను నిర్మిస్తోన్న వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా మూవీస్ బ్యాన‌ర్స్ కుమారి శ్రీమ‌తి సినిమాను నిర్మిస్తున్నారు. మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.

నిత్యామీన‌న్ న‌టిగానే కాకుండా నిర్మాత‌గానూ త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. అది కూడా తెలుగులో నిర్మించిన స్కైలాబ్ చిత్రంతో. చాలా వ‌ర‌కు సినిమాలు నేరుగా రిలీజ్ కాకుండా ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నిత్యామీన‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన కుమారి శ్రీమ‌తి మూవీ కూడా నేరుగా ఓటీటీలోకి రిలీజైంది.