English | Telugu

లీక్‌ వ్యవహారంలో పోలీసుల్ని ఆశ్రయించిన దిల్‌రాజు!

రామ్‌చరణ్‌, కియారా అద్వానీ జంటగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక పాట ఇటీవల లీక్‌ అయింది. ‘జరగండి.. జరగండి..’ అంటూ మొదలయ్యే ఈ పాట లీక్‌ అయి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై చిత్ర యూనిట్‌ షాక్‌ అయింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాట లీక్‌ అవ్వడాన్ని నిర్మాత దిల్‌ రాజు సీరియస్‌గా తీసుకున్నారు. శనివారం ఈ విషయాన్ని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, సైబరాబాద్‌ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ పాట లీక్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుల్ని పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు దిల్‌రాజు. అంతేకాదు, ఈ పాటను షేర్‌ చేస్తున్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలని తన కంప్లయింట్‌లో కోరారు దిల్‌రాజు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దానిపై ఎఫ్‌ఐఆర్‌ ఇష్యూ చేసి విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ లీక్‌కి కారణమైన వ్యక్తుల్ని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.