English | Telugu
'మార్టిన్ లూథర్ కింగ్' మూవీ రివ్యూ.. సంపూ చింపేశాడు కానీ?
Updated : Oct 27, 2023
సినిమా పేరు: మార్టిన్ లూథర్ కింగ్
తారాగణం: సంపూర్ణేష్ బాబు, శరణ్య ప్రదీప్, నరేష్, వెంకటేష్ మహా
సంగీతం: స్మరన్ సాయి
డీఓపీ: దీపక్ యరగేరా
కథ: మడోన్ అశ్విన్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా
ఎడిటింగ్, దర్శకత్వం: పూజ కొల్లూరు
నిర్మాతలు: శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, వెంకటేష్ మహా
బ్యానర్స్: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ: అక్టోబర్ 27, 2023
సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'. ఇది తమిళ సినిమా 'మండేలా'కు రీమేక్ గా రూపొందింది. ఇప్పటిదాకా స్టార్ హీరోల సినిమాలకు స్పూఫ్స్ లా ఉండే సినిమాల్లో నటించిన సంపూ.. మొదటిసారి రూట్ మార్చి నటనకు ప్రాధాన్యమున్న కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేశాడు. సందేశం, వినోదం కలగలిసిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సంపూకి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
స్మైల్(సంపూర్ణేష్ బాబు) పడమరపాడు అనే గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవించే ఓ అనాథ. ఆ ఊరిలోని మర్రి చెట్టే అతని ఇల్లు. ఊరిలో అందరూ అతన్ని చిన్నచూపు చూస్తుంటారు. ఎడ్డోడు, వెర్రిబాగులోడు అంటూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పిలుస్తుంటారు. స్మైల్ చెప్పులు కుట్టుకుంటూ, పాచి పనులు చేస్తూ రూపాయి రూపాయి పోగు చేసి దాచుకుంటూ.. ఎప్పటికైనా చిన్న చెప్పుల షాప్ పెట్టుకోవాలని కలలు కంటుంటాడు. అయితే స్మైల్ దాచుకున్న కొంత డబ్బుని ఎవరో దొంగలించడంతో.. పోస్టాఫీస్ లో దాచుకోమని అతని ఫ్రెండ్ సలహా ఇస్తాడు. దీంతో పోస్టాఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాలని వెళ్తాడు. అయితే పోస్టాఫీస్ లో పని చేసే వసంత(శరణ్య ప్రదీప్).. స్మైల్ కి కనీసం అసలు పేరేంటో కూడా తెలియదని, ఏ గుర్తింపు కార్డు లేదని తెలుసుకొని.. అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టి, అకౌంట్ ఓపెన్ చేసి, అన్ని గుర్తింపు కార్డులు అప్లై చేస్తుంది. మరోవైపు ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ ఎన్నికల్లో దక్షిణ దిక్కు నాయకుడు లోకి(వెంకటేష్ మహా), ఉత్తర దిక్కు నాయకుడు జగ్గు(నరేష్) పోటీ పడతారు. ఇరు వర్గాలకు సమాన సంఖ్యలో ఓటర్లు ఉంటారు. ఎవరు గెలవాలన్నా ఒక్క ఓటు కావాలి. అలాంటి సమయంలో మార్టిన్ లూథర్ కింగ్ కి ఓటరు గుర్తింపు కార్డు వస్తుంది. దీంతో కింగ్ ని ప్రసన్నం చేసుకొని ఆ ఓటుతో గెలవడం కోసం లోకి, జగ్గు ఇద్దరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఓటు హక్కు రావడంతో స్మైల్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ ఓటు హక్కు వల్ల అతనికి, ఆ ఊరికి నష్టం జరిగిందా లేక లాభం చేకూరిందా? ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనే సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఇది ఓటు విలువని తెలియజేసే చిత్రం. రీమేక్ అయినప్పటికీ.. మూల కథను చెడగొట్టకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడికి తగ్గట్టుగా హీరో వృత్తిని మార్చిన ఆలోచన బాగుంది. పడమరపాడు గ్రామాన్ని, రెండు వర్గాల గొడవలను, స్మైల్ పాత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమైంది. అసలు పేరే లేని వ్యక్తి, ఓటు హక్కు వచ్చాక కింగ్ లా మారే సన్నివేశాలు మెప్పించాయి. గెలుపు కోసం అతని ఓటు కీలకం కావడం, ఆ ఓటు కోసం ఇరు వర్గాలు పోటీ పడటం ఆకట్టుకుంది.
అయితే ఒరిజినల్ తో పోలిస్తే ఇందులో ఆశించిన స్థాయిలో హాస్యం పండలేదు. కథనం కూడా నెమ్మదిగా సాగింది. కామెడీ వర్కౌట్ అయినట్లయితే కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలిగేది కాదు. మండేలాలో కామెడీతో పాటు సెకండాఫ్ లో ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయి. కానీ ఇందులో ఎమోషన్స్ లో కూడా అంత బలంగా కనెక్ట్ అయ్యేలా లేవు.
ఈ చిత్రానికి వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. అయితే ఆయన స్క్రిప్ట్ ని మరింత బలంగా రాసుకొని ఉండాల్సింది. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలగలిసిన ఈ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ కి రచయితగా వెంకటేష్ మహా పూర్తి న్యాయం చేయలేకపోయారు. కామెడీ, సెంటిమెంట్ ఆశించినస్థాయిలో వర్కౌట్ కాలేదు. కింగ్ ఇరు వర్గాల నుండి గిఫ్ట్ లు తీసుకుంటూ పబ్బం గడిపే ఎపిసోడ్ నవ్వు తెప్పించినప్పటికీ.. మరీ సాగదీసినట్టుగా ఉంది. పతాక సన్నివేశాలు కూడా తేలిపోయాయి. కొత్త దర్శకురాలు అయినప్పటికీ పూజ కొల్లూరు తనకిచ్చిన స్క్రిప్ట్ ని బాగానే తెరకెక్కించారు.
నటీనటుల పనితీరు:
మార్టిన్ లూథర్ కింగ్ గా సంపూర్ణేష్ బాబు ఆకట్టుకున్నాడు. ఓటు హక్కు రాకముందు, వచ్చిన తర్వాత పాత్రలోని వేరియేషన్ ని చక్కగా చూపించాడు. లోకి గా వెంకటేష్ మహా, జగ్గు గా నరేష్ వారి పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
ఓటు విలువని తెలియజేస్తూ తీసిన ఈ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, నెమ్మదిగా సాగే కథనం కారణంగా అంతగా మెప్పించలేకపోయింది. కథా నేపథ్యం, సంపూ నటనలోని కొత్తదనం కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.25/5