English | Telugu
'జైలర్' దర్శకుడితో అల్లు అర్జున్.. అట్లీ సినిమా అటకెక్కింది!
Updated : Sep 20, 2023
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' మూవీ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. 'పుష్ప-2' వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుండగా, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సందీప్ రెడ్డి సినిమా మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ లో మరో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు బన్నీ. అయితే రీసెంట్ గా 'జవాన్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా దాదాపు ఖరారైందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సడెన్ గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.
తక్కువ సినిమాలతోనే తమిళ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, నెల్సన్ చెప్పిన కథ బన్నీకి నచ్చిందని వినికిడి. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు నెల్సన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని సమాచారం. మొత్తానికి నెల్సన్ ఎంట్రీతో ప్రస్తుతానికి బన్నీ-అట్లీ కాంబినేషన్ లో సినిమా లేనట్టేనని అంటున్నారు.